Loading...
AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల జోరు.. తొలి విడతలో 1.18 లక్షల నామినేషన్లు!
ఏపీలో పంచాయతీ ఎన్నికల జోరు.. తొలి విడతలో 1.18 లక్షల నామినేషన్లు!

AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల జోరు.. తొలి విడతలో 1.18 లక్షల నామినేషన్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2026
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ప్రక్రియలో భారీ స్పందన కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు. మొత్తం 26 జిల్లాల్లోని 42 రెవెన్యూ డివిజన్లు, 201 మండలాలు, 3,949 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు కలిపి మొత్తం 1,18,114 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచ్ పదవులకు 25,985 నామినేషన్లు రాగా.. వార్డు సభ్యుల స్థానాలకు 92,129 నామినేషన్లు వచ్చాయి. జిల్లాల వారీగా నామినేషన్ల సంఖ్యను పరిశీలిస్తే ఆసక్తికరమైన వివరాలు వెల్లడయ్యాయి.

వివరాలు

సర్పంచ్ నామినేషన్లలో తిరుపతి టాప్

రాష్ట్రంలో అత్యధికంగా 404 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన జిల్లా తిరుపతి. ఇక్కడ సర్పంచ్ పదవుల కోసం 3,261 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 7,088 నామినేషన్లు దాఖలయ్యాయి.

దీంతో సర్పంచ్ నామినేషన్ల విషయంలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇక అనంతపురం జిల్లాలో సర్పంచ్ పదవులకు 1,822 నామినేషన్లు దాఖలయ్యాయి.

వైఎస్సార్ కడప జిల్లాలో 1,550, అనకాపల్లి జిల్లాలో 1,347 నామినేషన్లు వచ్చాయి. ఈ జిల్లాల్లోనూ సర్పంచ్ పదవుల కోసం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీకి ఆసక్తి చూపించారు.

వివరాలు

వార్డు సభ్యుల నామినేషన్లలో అనకాపల్లి ముందంజ

వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లలో అనకాపల్లి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో మొత్తం 6,549 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఏలూరు జిల్లాలో 5,154, విజయనగరం జిల్లాలో 5,134 నామినేషన్లు వచ్చాయి. మరోవైపు అన్నమయ్య జిల్లాలో అత్యల్పంగా 85 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.

ఇక్కడ సర్పంచ్ పదవులకు 329, వార్డు సభ్యుల స్థానాలకు 1,112 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి.

ADVERTISEMENT

వివరాలు

విశాఖ, గుంటూరులో తొలి విడత ఎన్నికలు లేవు

ఇదిలా ఉంటే.. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో పోలింగ్ జరగడం లేదు.

మిగిలిన జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదలైన గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.

మొత్తంగా తొలి విడత ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు కలిపి 1.18 లక్షలకు పైగా నామినేషన్లు దాఖలు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి నెలకొంది.

భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలోకి దిగేందుకు సిద్ధం కావడంతో రాజకీయ వర్గాల్లోనూ ఈ ఎన్నికలపై ఆసక్తి పెరిగింది.

ADVERTISEMENT