Gujarat: గుజరాత్‌లో అంతుచిక్కని వ్యాధి.. ఇప్పటికే 15 మంది మృతి
గుజరాత్‌లోని కచ్ జిల్లా లఖ్‌పత్ పట్టణంలో వారం రోజులుగా చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ వ్యాధితో ఇప్పటికే 15 మంది ప్రాణాలు విడిచారు. సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 7 వరకు 10 మంది చనిపోగా, ఆ తర్వాత మరో ఐదు మరణాలు నమోదయ్యాయి. మొదట పిల్లలు, పెద్దలకు ఈ వ్యాధి సోకింది. మరణించిన వారి నుండి సేకరించిన 11 నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు జిల్లా కలెక్టర్ అమిత్ అరోరా తెలిపారు. ఫలితాలు త్వరలోనే వస్తాయని, ఇది తెలిసిన వెంటనే వైరస్ ఏదో కనుక్కోవచ్చని కలెక్టర్ అన్నారు.
లఖ్‌పత్ ప్రాంతంలో అదనపు వైద్య సిబ్బంది
ఈ వ్యాధి వ్యాప్తిని కట్టడి చేసేందుకు లఖ్‌పత్ ప్రాంతంలో 22 నిఘా బృందాలు, అదనపు వైద్య సిబ్బందిని నియమించారు. లఖ్‌పత్ పట్టణం పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో, ఇది ప్రత్యేకమైన పరిశీలనలో ఉంది. మరణాలకు కాలుష్యం లేదా అంటువ్యాధి కారణం అనిపించడం లేదు. అయితే కచ్ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు ఈ పరిస్థితికి ప్రభావం చూపి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యాధి వల్ల బాధితులకు జ్వరం, జలుబు, దగ్గు, న్యుమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి.