'ప్రత్యేక హోదా కోసం పోరాడండి'; ఏపీ మంత్రులకు హరీష్ రావు కౌంటర్
బీఆర్‌ఎస్, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో వివాదం ప్రారంభమైన నేపథ్యంలో ఆయన సోమవారం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఏపీ ప్రజలను అవమానించలేదని, కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని హరీష్ స్పష్టం చేశారు. 'ఆంధ్రప్రదేశ్‌పై తాను చేసిన వ్యాఖ్యలను అక్కడి అధికార పార్టీ నేతలు వక్రీకరించారని చెప్పుకొచ్చారు. తాను ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా ఎటువంటి తప్పుడు మాటలు మాట్లడలేదన్నారు. కానీ వాస్తవికంగా ఉన్న కొన్ని సమస్యలను మాత్రమే లేవనెత్తినట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో ఎవరు పని చేసినా రాష్ట్ర ప్రగతిలో వారు భాగమే: హరీష్ రావు
కొందరు నాయకులు తనను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని హరిశ్‍రావు అసహనం వ్యక్తం చేశారు. ఆ నాయకులు సమర్ధులైతే ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం పూర్తి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని హితవు పలికారు. ఈ పోరాటాల్లో విజయం సాధించి ప్రజలకు తమ సత్తా చూపాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు తమ ఓట్లను రద్దు చేసుకోవాలని కోరడంపై హరీశ్ క్లారిటీ ఇచ్చారు. తాను మాట్లాడిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన మంచి పని గురించి ప్రస్తావించినట్లు చెప్పారు. అందులో కొందరు ఆంధ్రాకు చెందినవారు ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ఎవరు పని చేసినా రాష్ట్ర ప్రగతిలో వారు భాగమేనన్నారు. వారిని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ చెప్పినట్లు గుర్తు చేశారు.