Fire Accident : యాదాద్రి పవర్ ప్లాంట్‌లో మంటలు.. అప్రమత్తమైన సిబ్బంది
ఈ వార్తాకథనం ఏంటి
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణలోని నల్గొండ జిల్లా వీర్లపాలెంలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక విద్యుత్ కేంద్రంలోని యూనిట్-3 పరిధిలో టర్బైన్ డ్రైవన్ బాయిలర్ ఫీడ్ పంప్ (BFB) ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, షార్ట్ సర్క్యూట్ సంభవించడం, అదే సమయంలో ఆయిల్ లీకేజీ జరగడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ప్లాంట్ అధికారులు, సాంకేతిక సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది యుద్ధప్రాతిపదికన స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పాటు ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది.
వివరాలు
గతేడాది మేలో యూనిట్ 1లో ప్రమాదం
అగ్నిప్రమాదం కారణంగా ప్లాంట్‌లోని కంట్రోల్ కేబుల్స్, వాల్వ్స్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. అయితే ఈ విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదాలు జరగడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది మే నెలలో కూడా యూనిట్-1లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ముఖ్యంగా, యూనిట్-3లో కొద్ది రోజుల క్రితమే అనధికారికంగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన నేపథ్యంలో మళ్లీ ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం అధికారులు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద ప్రాంతంలో వ్యాపించిన దట్టమైన పొగ తొలగిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించి, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను విశ్లేషించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.