కోనసీమ: బోరుబావి నుంచి భారీగా ఎగసిపడుతున్న గ్యాస్, మంటలు
ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ ఆక్వా చెరువు వద్ద గల బోరు నుంచి గ్యాస్ ఎగిసిపడుతోంది. అలాగే గ్యాస్‌కు అగ్ని కిలలు కూడా తోడవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాజోలు మండలం శివకోడులో చేపల చెరువు వద్ద గల భావిలో శనివారం ఉదయం నుంచి దాదాపు 20అడుగుల లోతు నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. గ్యాస్ కూడ పైకి ఉబికివస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న ఓఎన్జీసీ అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందితో కలిసి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
గ్యాస్‌ను అదుపు చేయడం కష్టంగా మారింది: అధికారులు
బావి నుంచి గ్యాస్ ఎగిసిపడుతున్న ప్రదేశంలో గతంలో సెస్మిక్ సర్వే నిర్వహించినట్లు స్థానికులు వెల్లడించారు. ఆక్వా చెరువుల్లో నీటి కోసం అదేచోట 6ఏళ్ల కిందట బోరు వేశారని వివరించారు. ఈ నేపథ్యంలోనే నీటికోసం రెండు రోజుల కిందట సదరు బోరును మరింత లోతుకు వేశారు. అప్పట్నుంచి బావి నుంచి గ్యాస్ బయటకు వస్తోంది. అయితే బావి నుంచి ఎగిసిపడుతున్న గ్యాస్‌ను అదుపు చేయడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. అది పైపులైన్ నుంచి వస్తున్నది కాదని, భూమిలో నుంచి సహజంగా పైకి రావడంతో అదుపు చేయలేకపోతున్నట్లు స్పష్టం చేశారు. ఘటనకు గల కారణాలను ప్రాథమిక విచారణ తర్వాతే వెల్లడించగలమని అధికారులు చెబుతున్నారు.