Kerala : కేరళ ఆలయంలో బాణాసంచా పేలుడు.. 150 మందికి పైగా గాయాలు
కేరళలో ఓ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళలోని ఒక ఆలయంలో జరిగిన టెంపుల్ ఫెస్టివల్‌లో బాణాసంచా నిల్వలో భారీ పేలుడు సంభవించి, భయంకర మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో 150 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఎనిమిది మంది పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి నీలేశ్వరం సమీపంలోని ఒక ఆలయంలో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను కాసరగోడ్, కన్నూర్, మంగళూరు ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సహా అధికార యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
బాధితులను ఆదుకునేందుకు చర్యలు
బాధితులను తక్షణమే ఆదుకునేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వీరర్కవు దేవాలయం సమీపంలోని ఒక దుకాణంలో భద్రంగా ఉంచిన బాణాసంచా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పేలుడు సంభవించింది. ఘటనా స్థలంలో జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అంజుతాంబలం వీరర్కవు ఆలయంలో వార్షిక కాళియాట్టం ఉత్సవం జరుగుతుండగా, పటాకులు స్టోరేజీలో భద్రంగా ఉంచారు. రాత్రి 12.30 సమయంలో ఒక భారీ పేలుడు సంభవించడంతో పటాకులు ఒకదాని తర్వాత ఒకటి అంటుకొని, మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 150 మందికి పైగా మంటల్లో చిక్కుకున్నారు. వెంటనే అగ్నిమాపక వాహనాలు రప్పించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.