
Hyderabad: చందానగర్‌లో కాల్పులు.. నగల షాపు వద్ద ఉద్రిక్తత
ఈ వార్తాకథనం ఏంటి
చందానగర్‌లో మంగళవారం ఉదయం పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ నగల షాపులోకి చొరబడి భారీ దోపిడీ యత్నం చేశారు. ఈ క్రమంలో రెండు రౌండ్ల కాల్పులు జరిపి, ఒకరికి గాయాలు కలిగించారు. వివరాల్లోకి వెళ్తే ఉదయం సుమారు 10.35 గంటలకు ఖజానా జ్యువెలరీ షాపు తెరచిన ఐదు నిమిషాలకే ఆరుగురు సభ్యుల ముఠా లోపలికి దూసుకెళ్లింది. లాకర్ తాళాలు ఇవ్వాలని అసిస్టెంట్ మేనేజర్‌ను గన్‌తో బెదిరించింది. అతను అంగీకరించకపోవడంతో నేరస్థులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో సిబ్బందిలో సతీష్ అనే వ్యక్తి గాయపడి, వెంటనే ఆస్పత్రికి తరలించబడ్డాడు.
Details
గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
దాడి సమయంలో దుండగులు షాపులోని సీసీ కెమెరాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. బంగారు ఆభరణాల స్టాల్స్‌ను పగలగొట్టారు. అయితే సిబ్బంది చాకచక్యంగా పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు అక్కడికి చేరుకునేలోపే ముఠా పారిపోయింది. వారు ఆర్సీపురం వైపు పారిపోయినట్లు అనుమానం వ్యక్తమైంది. దుండగులు వెండి సామాన్లను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. సీసీటీవీ కెమెరాల్లో ఘటన రికార్డ్ అయ్యింది. మొత్తం పది బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు గాలింపు ప్రారంభించారు. సీపీ అవినాష్ మహంతి ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి, మీడియాకు వివరాలు తెలిపారు.