Jag Vikram: కాల్పుల విరమణ తర్వాత భారత్‌కు చేరిన తొలి ఎల్పీజీ ట్యాంకర్
ఈ వార్తాకథనం ఏంటి
గల్ఫ్ నుంచి భారీ ఎల్పీజీ లోడ్‌తో ఇండియాకు బయల్దేరిన మరో నౌక 'జగ్ విక్రమ్' హర్మూజ్ (Hormuz) జలసంధిని సురక్షితంగా దాటింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జలసంధిని దాటిన ఈ నౌక ఈ మధ్యాహ్నానికి గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోకి ప్రవేశించింది. మరికొద్ది రోజుల్లో ఇది భారత్‌కు చేరుకోనుంది. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ (US-Iran Ceasefire) ప్రకటించిన తర్వాత హర్మూజ్‌ను దాటిన మొట్ట మొదటి నౌక (Jag Vikram) ఇదే. ఈ గ్యాస్ ట్యాంకర్ 20,000 టన్నుల ఎల్పీజీని తీసుకురానుంది. జలసంధిని దాటడానికి అనుమతి కోసం జగ్ విక్రమ్ వారం రోజులకు పైగా గల్ఫ్ జలాల్లో ఎదురుచూసినట్లు షిప్పింగ్ డేటా నివేదికలు వెల్లడించాయి.
వివరాలు
త్వరలో మరిన్ని నౌకలు
ఈ ట్యాంకర్ ముంబయిలోని గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ యాజమాన్యానికి చెందినదిగా తెలుస్తోంది. మరో 15 భారత రిజిస్టర్డ్ నౌకలు పర్షియన్ గల్ఫ్‌లోనే ఉన్నాయని.. త్వరలో అవి కూడా ఇదే మార్గం గుండా భారత్‌కు చేరుకునే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. వాటిలో ఒక ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్, నాలుగు ముడి చమురు ట్యాంకర్లు, ఒక ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్, ఒక రసాయన ఉత్పత్తుల ట్యాంకర్, మూడు కంటైనర్ నౌకలు, రెండు బల్క్ క్యారియర్లు, మూడు ఇతర నౌకలు ఉన్నట్లు తెలుస్తోంది.