Andhra Pradesh: ఏపీలో తొలిసారి టెంపుల్ టూరిజం కారవాన్.. ఆలయ పర్యాటకానికి కొత్త ఊపిరి
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల సందర్శనకు మొట్టమొదటి టెంపుల్ టూరిజం కారవాన్‌కు శ్రీకారం చుట్టారు. ఆలయ పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించాలనే లక్ష్యంతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కారవాన్ ద్వారా భక్తులకు ఆధునిక ప్రయాణంతో పాటు వసతి సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో రూపొందించిన ఈ టెంపుల్ టూరిజం కారవాన్‌ను మంత్రి ప్రారంభించి, వాహనంలోని సదుపాయాలు, ఫీచర్లు, కార్యాచరణ ప్రణాళికపై అధికారులతో సమీక్షించారు. ఈ చొరవ భక్తులకు మరింత సౌకర్యవంతమైన, సుసంపన్నమైన తీర్థయాత్ర అనుభూతిని అందిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనాలో ఈ కారవాన్‌ను అభివృద్ధి చేసినందుకు నెల్లూరు జిల్లాకు చెందిన వై. శ్రీనివాస రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
Details
టెంపుల్ టూరిజం కారవాన్‌లను ప్రవేశపెట్టాలన్నది ప్రభుత్వ లక్ష్యం
ప్రైవేట్ భాగస్వాముల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి టెంపుల్ టూరిజం కారవాన్‌లను ప్రవేశపెట్టాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. దీని వల్ల భక్తులు రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సౌకర్యవంతంగా దర్శించుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన పుణ్యక్షేత్రాలను ఇంటిగ్రేటెడ్ టూరిజం సర్క్యూట్‌లుగా అభివృద్ధి చేయాలనే దార్శనిక ఆలోచనతో ఆలయ పర్యాటకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని రామనారాయణ రెడ్డి వివరించారు. ఆలయ పర్యాటక కార్యక్రమాలను వేగవంతం చేయడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో, తాను, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డితో కూడిన ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Details
సమగ్ర సమాచారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్
అలాగే, యాత్రా కేంద్రాలు, వసతి సౌకర్యాలు, ఆలయ పర్యాటక సర్క్యూట్‌లపై సమగ్ర సమాచారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా భక్తులు, పర్యాటకులు తమ ప్రయాణాలను సులభంగా ప్లాన్ చేసుకోవచ్చన్నారు. పర్యాటక శాఖ నేతృత్వంలోని ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ప్రతి జిల్లాలో టెంపుల్ టూరిజం కారవాన్ వాహనాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు మంత్రి రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఏపీలో ఆలయ పర్యాటకానికి కొత్త ఊపిరి లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.