LOADING...
Terror-Free Month: 30 ఏళ్లలో తొలిసారి.. ఉగ్రవాద ఘటనలేని నెలగా మే 2026
30 ఏళ్లలో తొలిసారి.. ఉగ్రవాద ఘటనలేని నెలగా మే 2026

Terror-Free Month: 30 ఏళ్లలో తొలిసారి.. ఉగ్రవాద ఘటనలేని నెలగా మే 2026

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 01, 2026
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో మే 2026 నెలను అధికారులు 'ఉగ్రరహిత నెల'గా గుర్తించారు. గత మూడు దశాబ్దాల కాలంలో ఉగ్రవాద సంబంధిత హత్యలు లేదా దాడులు ఏవీ నమోదు కాకుండా గడిచిన నెల ఇదే తొలిసారి అని వారు వెల్లడించారు. మే నెల మొత్తం ప్రశాంతంగా సాగిందని, ఒక్క ఉగ్ర ఘటన కూడా చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం, ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఉగ్రవాదానికి సంబంధించిన మరణాలు కేవలం 12 మాత్రమే నమోదయ్యాయి. ముఖ్యంగా ఈ మరణాల్లో సాధారణ పౌరుల ప్రాణనష్టం లేకపోవడం గమనార్హం. ఒకప్పుడు ఉగ్రవాద హింస తీవ్రస్థాయిలో ఉన్న జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం పరిస్థితులు గణనీయంగా మారినట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

వివరాలు 

ఒకప్పుడు ప్రతిరోజూ ఉగ్ర ఘటనలు

2000,2001 సంవత్సరాల్లో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండేవి. 2000 మే నెలలో 288 ఉగ్రవాద సంబంధిత మరణాలు నమోదుకాగా, 2001 మేలో ఆ సంఖ్య 300కు చేరుకుంది. ఆ సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దాదాపు ప్రతిరోజూ ఉగ్రదాడులు జరిగేవి. ఈ ఘటనల్లో పౌరులు,భద్రతా సిబ్బంది,ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయేవారు. అనంతర కాలంలో మరణాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. 2002 మేలో 288, 2003లో 241, 2004లో 195, 2005లో 188, 2006లో 140 మరణాలు నమోదయ్యాయి. 2007 తర్వాత హింసాత్మక ఘటనలు తగ్గినా, ఉగ్రవాద ముప్పు పూర్తిగా అంతరించలేదు. 2016 తర్వాత కొన్ని ప్రాంతాల్లో మళ్లీ ఉగ్రచర్యలు పెరిగిన పరిస్థితులు కనిపించాయి.

వివరాలు 

భద్రతా చర్యల ఫలితమే: అధికారులు

ఇటీవలి గణాంకాలను పరిశీలిస్తే,2024 మే నెలలో జరిగిన ఉగ్ర ఘటనల్లో ఏడుగురు మరణించగా,2025 మేలో ఈ సంఖ్య 43కు చేరింది. అయితే 2026 మేలో మాత్రం ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం విశేషంగా నిలిచింది. జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు,ఆధునిక నిఘా వ్యవస్థలు,భద్రతా సంస్థల మధ్య మెరుగైన సమన్వయం కారణంగానే ఈ పరిస్థితి సాధ్యమైందని అధికారులు తెలిపారు. ఉగ్రవాద సంస్థలకు స్థానికంగా లభిస్తున్న మద్దతు కూడా క్రమంగా తగ్గిపోవడంతో వాటి నెట్‌వర్క్ బలహీనపడుతోందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఉగ్రవాద గ్రూపులు తమ కార్యకలాపాలను పునరుద్ధరించుకునే అవకాశాలను భద్రతా దళాలు ముందుగానే అడ్డుకుంటున్నాయని వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌ను పూర్తిగా ఉగ్రవాద రహిత ప్రాంతంగా మార్చడమే తమ లక్ష్యమని,ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.

Advertisement