తెలంగాణ ఆరోగ్యశ్రీలో కీలక పరిణామం.. ఉచితంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసిన నిమ్స్ వైద్యులు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ మరో కీలక ముందడుగేసింది. ఆరోగ్యశ్రీలో పథకంలో భాగంగా తొలిసారిగా పూర్తి ఉచితంగా ఊపిరితిత్తుల మార్పిడి చేపట్టింది. ఈ మేరకు నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఓ రోగి ప్రాణం నిలబెట్టారు.
వరంగల్ వాస్తవ్యురాలు 16 ఏళ్ల రాయపురి పూజను నిమ్స్ వైద్యులు మంగళవారం బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో కుటుంబీకులు అవయవదానానికి సిద్ధపడ్డారు. కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాను దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే నిమ్స్ వైద్య బృందం ఒకే రోజు ఆరోగ్యశ్రీ పరిధిలో పలు అవయవాల మార్పిడి శస్త్ర చికిత్సలు చేపట్టారు.
సిద్దిపేటకు చెందిన 45 ఏళ్ల సీహెచ్ హైమావతి గత 6 ఏళ్లుగా లంగ్స్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.
DETAILS
మార్పిడి కోసం 12 గంటల పాటు శ్రమించిన ప్రత్యేక వైద్య బృందం
హైమావతికి ఊపిరితిత్తుల సామర్థ్యం క్రమంగా తగ్గడం వల్ల నివాసంలోనే ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్నారు. ప్రాణవాయువు లేకుండా ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. దీంతో ఊపిరితిత్తుల మార్పిడి ఒక్కటే పరిష్కారమని నిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు.
ఈ మేరకు జూన్‌లో జీవన్‌దాన్ లో పేరు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం అవయవమార్పిడి చేశారు.
ఒక్క మార్పిడి ఆరు సర్జరీలతో సమానమని సర్జరీ డిపార్ట్ మెంట్ హెచ్ఓడీ డాక్టర్ అమరీశ్ తెలిపారు. సుమారు 12 గంటల పాటు శ్రమించిన ప్రత్యేక వైద్య బృందం హైమావతికి ఊపిరితిత్తుల మార్పిడిని విజయవంతంగా నిర్వహించింది.
నిమ్స్‌కు చెందిన 8 విభాగాల్లో 40 మంది వైద్యులు సదరు మార్పిడిలో పాలుపంచుకున్నట్లు డాక్టర్ అమరీశ్ పేర్కొన్నారు.
DETAILS
రూ.20 లక్షల వరకు ఖర్చయ్యే చికిత్సలకు ఆరోగ్యశ్రీ
ప్రస్తుతం హైమావతి ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆమె పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని చీఫ్ డాక్టర్ అమరీశ్ తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి నిమ్స్ వైద్యుల తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు. తొలిసారిగా ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహంతో అరుదైన చికిత్సలు చేయగలుతున్నామని నిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ బీరప్ప అన్నారు.
కార్పోరేట్, ప్రైవేట్ రంగంలో దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చయ్యే చికిత్సలను ఆరోగ్య శ్రీతో ఉచితంగా పొందగలమనే భరోసా పేదలకు లభించిందన్నారు.