నాలుగు శాఖల్లో సర్దుబాటు కానున్న వీఆర్ఏలు.. నేడు కీలక ఉత్తర్వులు జారీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు.ఈ మేరకు వీఆర్ఏల క్రమబద్ధీకరణపై ఉన్నతాధికారులతో ఆదివారం సీఎం సమీక్షించారు. వీఆర్ఏల క్రమద్ధీకరణ, ఉద్యోగుల సర్దుబాటును 4 శాఖల్లో పూర్తి చేయనున్నారు.సుమారు 21 వేల మంది రెవెన్యూ అసిస్టెంట్లను నీటిపారుదల, పురుపాలక, పంచాయితీ రాజ్, మిషన్ భగీరథ శాఖల్లోకి సర్దుబాటు చేసేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే 61 ఏళ్లు దాటిన ఉద్యోగులు, తమ వారసులకు కారుణ్య నియామకం కింద విధులు అప్పగించేందుకు సీఎం ఓకే చెప్పినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడు వెలువడనున్నాయి. జూన్ 2, 2014 తర్వాత 61 ఏళ్ల లోపు ఉండి విధులు నిర్వహిస్తూ చనిపోయిన వారి ఉద్యోగాలను వారసులకు ఇస్తామన్నారు.
విద్యార్హతల ప్రకారమే వీఆర్ఏల కేటాయింపులు : ప్రభుత్వం
ప్రస్తుతం 21 వేల 433 మంది వీఆర్ఏలు విధుల్లో ఉన్నారు. ఇప్పటికే లష్కర్ పేరిట నీటిపారుదల శాఖలో 5 వేల 900 మందిని సర్దుబాటు చేస్తున్నారు. ఈ మేరకు నియామక పత్రాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు 3 వేల మందిని మిషన్ భగీరథలో నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. క్రమబద్ధీకరణలో మిషన్ భగీరథ, నీటిపారుదల శాఖలకే అత్యధిక మందిని కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. పీజీ, డిగ్రీ లాంటి ఉన్నత విద్య చదివిన వారిని పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు కృషి చేస్తోంది. రెవెన్యూ శాఖలో ఇప్పటికే రూ.10,500 గౌరవ వేతనంపై వీఆర్ఏలు పనిచేస్తున్నారు. ఇకపై వీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. సర్దుబాటు ప్రక్రియ అనంతరం పే స్కేల్ సైతం వర్తింపచేయనున్నట్లు సమాచారం.