Telangana: దివ్యాంగులకు గుడ్ న్యూస్; వచ్చే నెల నుంచే పింఛన్ పెంపు అమలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దివ్యాంగులకు శుభవార్త చెప్పారు. దివ్యాంగుల పింఛన్‌ను వెయ్యి రూపాయలు పెంచుతామని జూన్ 9న మంచిర్యాల సభలో కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పింఛన్ పెంపుపై ఉత్తర్వులు జారీ చేసారు. వచ్చే నెల నుంచి పెంచిన పింఛన్ అమల్లోకి రానుంది. పెంచిన మొత్తంతో వికలాంగులు నెలకు 4,016రూపాయలను అందుకోనున్నారు. ఆసరా ఫించన్‌లో భాగంగా ప్రస్తుతం దివ్యాంగులకు 3,016రూపాయలు ప్రభుత్వం నుంచి పింఛన్ అందుతుంది. ఇకపై 4,016రూపాయలు అందనుంది. పింఛన్ పెంపు కారణంగా తెలంగాణ ప్రభుత్వంపై అదనంగా రూ.51.68కోట్ల భారం పడనున్నది.
ఇప్పటివరకు మూడు సార్లు పెరిగిన దివ్యాంగుల పెన్షన్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల పింఛన్ పెరగడం ఇది మూడవసారి. మొదటగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే 500రూపాయల నుంచి 1500రూపాయలకు పెంచారు. ఆ తర్వాత కేసీఆర్ రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాక, 1500రూపాయల నుంచి 3016రూపాయలకు పెంచారు. ప్రస్తుతం మూడో సారి 4,016రూపాయలకు పెంచారు. ఈ పెంపు కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 5,16,890మంది దివ్యాంగులకు లబ్ది చేకూరుతుంది. గత తొమ్మిది సంవత్సరాల్లో కేవలం దివ్యాంగుల పింఛన్ కోసమే రూ.10,310.46కోట్ల నిధులకు తెలంగాణ సర్కార్ వెచ్చించింది.