హైదరాబాద్: ఉచిత చేప మందు పంపిణీదారుడు బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత
హైదరాబాద్లో ఏటా చేప మందును పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూశారు. ముషీరాబాద్, బొలక్ పూర్ లోని పద్మశాలి కాలనీలో నివాసం ఉంటున్న ఆయన ఇటీవలే అనారోగ్యం పాలయ్యారు.ఈ మేరకు బుధవారం పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. బత్తిని హరినాథ్ గౌడ్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.బత్తిని హరినాథ్, సునిత్రదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాతబస్తీలోని దూద్ బౌలి కి చెందిన బత్తిని సోదరులు మొత్తం ఐదుగురు. ఇప్పటికే ముగ్గురు చనిపోగా.. తాజాగా హరినాథ్ గౌడ్ మరణించారు. ప్రస్తుతం విశ్వనాథ్ మాత్రమే ఉన్నారు. ఏటా మృగశిర కార్తెని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేపమందును పంపిణీ చేస్తారు బత్తిని కుటుంబీకులు.
పూర్వీకుల నుంచే ఆచారంగా మారిన చేప మందు పంపిణీ
చేప ప్రసాదం కోసం తెలంగాణ, ఏపీ నలుమూలల నుంచి తరలివస్తారు. మరోవైపు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చేప మందు కోసం వస్తుంటారు. తొలిసారిగా 1847లో చేపమందు పంపిణీ మొదలైంది. ఆ కాలంలో వీరన్నగౌడ్ ప్రతి మృగశిర కార్తెకు ముందు రోజు చేప ప్రసాదాన్ని పంచేవాడు.ఆయన కుమారుడు బత్తిని శివరామ్ గౌడ్, అతని కుమారుడు బత్తిని శంకర్ గౌడ్ ప్రసాదాన్ని వారసత్వంగా పంపిణీ చేస్తూనే వచ్చారు. శంకర్ గౌడ్, సత్యమ్మ దంపతుల ఐదుగురు కుమారుల్లో బత్తిని హరినాథ్ గౌడ్, బత్తిని ఉమామహేశ్వర్ గౌడ్ కుటుంబ సభ్యులు మాత్రమే ఏటా చేప ప్రసాదాన్ని అందిస్తున్నారు. గత 176 ఏళ్లుగా వారు ఈ చేప మందును ఉచితంగా అందిస్తూ వస్తున్నారు.