Loading...
AP High Court: హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు.. రాష్ట్రపతి ఆమోదం
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు.. రాష్ట్రపతి ఆమోదం

AP High Court: హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు.. రాష్ట్రపతి ఆమోదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 03, 2026
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి శాశ్వత న్యాయమూర్తులుగా నియామకం లభించింది. జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు, జస్టిస్‌ తూట చంద్ర ధనశేఖర్‌ (టీసీడీ శేఖర్‌), జస్టిస్‌ చల్లా గుణరంజన్‌, జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్‌ జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్‌.. ఈ ఐదుగురితో సోమవారం శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అదనపు న్యాయమూర్తులుగా వీరి పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

వివరాలు

ఆమోదం తెలిపిన రాష్ట్రపతి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని కొలీజియం ఈ ఏడాది సెప్టెంబరు 23న ఈ ఐదుగురి పేర్లను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే.

ఈ సిఫారసుకు అనుగుణంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తాజాగా ఆమోదం తెలుపుతూ ఐదుగురినీ శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు, జస్టిస్‌ తూట చంద్ర ధనశేఖర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ 2024 అక్టోబరు 28న ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మరోవైపు జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్‌ జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు 2025 జనవరి 24న అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు.

ADVERTISEMENT