సిక్కిం వరదలు: 56కి చేరిన మృతుల సంఖ్య.. 142మంది కోసం రెస్క్యూ బృందాల గాలింపు
సిక్కింలో భారీ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య శనివారం నాటికి 56కి చేరుకుంది. సిక్కింలో 26 మృతదేహాలు లభ్యం కాగా, పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా నది పరీవాహక ప్రాంతంలో 30మృతదేహాలు లభ్యమయ్యాయి. వరదల కారణంగా గల్లంతు అయిన మరో 142 మంది కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. సిక్కింలో ఇప్పటివరకు 26మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ అధికారులు ధృవీకరించారు. మంగన్ జిల్లాలో నలుగురు, గ్యాంగ్‌టక్‌లో ఆరు, పాక్యోంగ్ జిల్లాలో ఏడుగురు ఆర్మీ సిబ్బందితో సహా మొత్తం 26మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ లెక్కల ప్రకారం, తీస్తా నది పరీవాహక ప్రాంతంలోని సిలిగురి, జల్పైగురి, కూచ్ బెహార్ అనే మూడు జిల్లాల నుంచి 30 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
సిక్కింలో బుధవారం తెల్లవారుజామున సంభవించిన ఆకస్మిక వరద తీవ్ర విధ్వంసానికి దారితీసింది. ఇది 25,000మంది ప్రజలను ప్రభావితం చేసింది, 1,200కంటే ఎక్కువ ఇళ్లు దెబ్బతిన్నాయి. 13 వంతెనలు, రోడ్లు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోయాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు 2,413మందిని రక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 22 సహాయ శిబిరాల్లో 6,875 మంది ఆశ్రయం పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా, శిబిరాల్లో తలదాచుకుంటున్న వారందరికీ తక్షణ సాయంగా రూ.2,000 చొప్పున ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ప్రకటించారు. బాధిత ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డీఆర్‌ఎఫ్) కేంద్ర వాటా నుంచి అడ్వాన్స్‌గా రూ. 44.8 కోట్లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.