Mamata Banerjee: బెంగాల్‌లో వరదలు.. కేంద్ర సాయం చేయలేదని మమతా బెనర్జీ విమర్శలు
ఉత్తర బెంగాల్‌లో వరదల పరిస్థితిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వరదలతో కూచ్ బెహార్, జల్పాయిగుడి జిల్లాలు సహా కోశి నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నా, కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందలేదని మండిపడ్డారు. ఫరక్కా బ్యారేజీ నిర్వహణ సరిగా జరగకపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోందన్నారు. దానికి కేంద్రం ప్రత్యక్ష హస్తం ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు.
డీవీసీ డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయడమే ఈ పరిస్థితికి కారణం
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) డ్రెడ్జింగ్ పనులు సరిగా నిర్వహించకపోవడంతో పలు జిల్లాల్లో వరదలు సంభవించాయన్నారు. డీవీసీ డ్యామ్‌ల నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్లనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. ఝార్ఖండ్-బెంగాల్ సరిహద్దులోని మైథాన్, పంచేత్ డ్యామ్‌ల నిర్వహణ వైఫల్యమే ఈ విపత్తుకు కారణమని ఆమె స్పష్టం చేశారు.