
Heavy Rains: ముంబయిలో వరదల బీభత్సం.. 250కి పైగా విమానాల పై ప్రభావం!
ఈ వార్తాకథనం ఏంటి
ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవనాన్ని స్తంభింపజేశాయి. రోడ్లు, రైల్వే పట్టాలు, దిగువ ప్రాంతాలు అన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబయి నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణం తీవ్రంగా ప్రభావితం కావడంతో ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలు తీవ్ర అంతరాయం ఎదుర్కొన్నాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు 250కి పైగా విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 9.50 గంటల మధ్యలో 8 విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. ప్రస్తుతం విమాన సర్వీసులు సగటున 45 నిమిషాల ఆలస్యంగా నడుస్తున్నాయి.
Details
లోకల్ ట్రైన్స్ రద్దు
దీనిపై ఎయిర్‌పోర్టు అధికారులు ప్రత్యేకంగా అడ్వైజరీ జారీ చేసి, ప్రయాణికులు తమ విమాన సమయాలను సంబంధిత వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవాలని సూచించారు. పలు ఎయిర్‌లైన్స్ కూడా ప్రయాణికులకు సూచనలు జారీ చేశాయి. నగరంలో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయిన దృష్ట్యా, ముందుగానే ఇళ్ల నుంచి బయలుదేరాలని కోరాయి. ఇదే సమయంలో భారీ వర్షాల కారణంగా రైల్వే పట్టాలు నీట మునిగిపోవడంతో ముంబయి లోకల్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రజల భద్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది.
Details
200 మి.మీ.కు పైగా వర్షపాతం
ప్రైవేట్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) విజ్ఞప్తి చేసింది. గత 24 గంటల్లో నగరంలోని అనేక ప్రాంతాల్లో 200 మి.మీ.కు పైగా వర్షపాతం నమోదైంది. విఖ్రోలి ప్రాంతంలో అత్యధికంగా 255.5 మి.మీ. వర్షపాతం నమోదు అయినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.