Air India fined: ఎయిర్ ఇండియాకు రూ.1.10కోట్ల జరిమానా విధించిన డీజీసీఏ
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ.1.10 కోట్ల జరిమానా విధించింది. సుదూర మార్గాల్లో నడిచే విమానాలకు సంబంధించి భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లే ఈ జరిమానా విధించినట్లు బుధవారం డీజీసీఏ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని సుదూర మార్గాల్లో నడుస్తున్న ఎయిర్ ఇండియా విమానాల్లో భద్రతా ఉల్లంఘనలు జరిగాయని తమ విచారణలో తేలినట్లు డీజీసీఏ ఆరోపించింది. విమానయాన సంస్థ నిబంధనలు పాటించలేదని తేలిందని డీజీసీఏ పేర్కొంది. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
సీనియర్ పైలట్ ఫిర్యాదు మేరకు డీజీసీఏ విచారణ
ఎయిర్ ఇండియాపై సీనియర్ పైలట్ చేసిన ఫిర్యాదును పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ సీరియస్‌గా తీసుకున్నాయి. ఉద్యోగి నుంచి అందిన ఫిర్యాదుపై DGCA విచారణ నిర్వహించింది. అవసరమైన అత్యవసర ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ లేకుండానే విమానయాన సంస్థ బోయింగ్ 777 విమానాలను యూఎస్‌కి నడిపిందని విచారణలో తేలినట్లు డీజీసీఏ తెలిపింది. ఫిర్యాదు చేసిన పైలట్ ఎయిర్ ఇండియాలో B777 కమాండర్‌గా పనిచేశారు. దీనిపై ఆయన అక్టోబర్ 29న మంత్రిత్వ శాఖకు, డీజీసీఏకు ఫిర్యాదు చేశారు. ఆ పైలెట్ ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో లేరు.