తెలంగాణ: రైతులకు బ్యాడ్ న్యూస్.. సెప్టెంబర్‌లో కూడా వర్షాలు లేనట్టే
తెలంగాణలో వర్షాలు మొహం చాటేశాయి. రాష్ట్రంలోకి ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాలు.. రానురాను బలహీనపడుతూ వచ్చాయి. దీంతో ఆగస్టులో అంతంత మాత్రంగా కురిసన వర్షాలు, సెప్టెంబర్‌లో కూడా తక్కువ వర్షాపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆగస్టు నెలంతా వాతావరణం పొడిగానే ఉందంటూ ఐఎండీ చెప్పింది. సెప్టెంబర్ నెలలో కూడా లోటు వర్షాపాతం నమోదవుతుందని చెప్పడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాణిజ్య పంటలపై ఈ లోటు వర్షాపాతం ప్రభావం పడుతుందని నిపుణలు చెబుతున్నారు. మరోవైపు సెప్టెంబర్ 17నుంచి దేశంలో నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్లనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
కూరగాయల ధరలు పెరిగే అవకాశం
సెప్టెంబర్‌లో వర్షాపాతం తగ్గితే దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా షుగర్, పప్పు ధాన్యాలు, కూరగాయల రేట్ల మండిపోతాయని నిపుణులు చెబుతున్నాయి. తెలంగాణలో 1972 తర్వాత ఈ ఆగస్టులో అత్యల్ప వర్షాపాతం నమోదైంది. వాస్తవానికి ఆగస్టులో 74.4మీమీ వర్షాపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 60శాతం తక్కువని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తెలంగాణలో 1960 నుంచి ఆగస్టులో అత్యల్ప వర్షాపాతం నమోదవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 1960లో 67.9మి.మీ, 1968లో 42.7 మి.మీ, 1972లో 83.2 మి.మీ వర్షం పడింది. ఈ ఏడాది ఆగస్టులో మాత్రం 74.4 మి.మీ వర్షాపాతం నమోదైంది.