Talasani srinivas yadav: హైదరాబాద్ రాజకీయాల్లో 'తలసాని' హవా.. 3సార్లు మంత్రిగా, 5సార్లు ఎమ్మెల్యేగా.. ఆయన ప్రొఫైల్ ఇదే
తలసాని శ్రీనివాస్ యాదవ్.. తెలుగునాట ఈ పేరు సుపరిచితం. 35ఏళ్లుగా హైదరాబాద్ రాజకీయాల్లో తలసాని తనదైన పాత్రను పోషిస్తున్నారు. బలమైన యాదవ సామాజిక వర్గం నేపథ్యమున్న తలసాని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అయినా.. తెలంగాణ ప్రత్యేకమైనా.. హైదారాబాద్ రాజకీయాల్లో ఆయనదే హవా అని చెప్పాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తలసాని మరోసారి సనత్ నగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి మంత్రి పదవిని చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న తలసాని ప్రొఫైల్‌ను ఓసారి పరిశీలిద్దాం. తలసాని తన రాజకీయ కెరీర్‌లో మూడుసార్లు మంత్రిగా పనిచేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సమకాలిన తెలంగాణ రాజకీయాల్లో.. ఈ స్థాయిలో రాజకీయ నేపథ్యం ఉన్న బీసీ నేత మరొకరు లేరు.
21వ ఏట రాజకీయాల్లోకి.. చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా..
తలసాని శ్రీనివాస్ యాదవ్ 1965లో అక్టోబర్ 6న హైదరాబాద్‌లో వెంకటేశం యాదవ్, లలితా బాయి దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి తలసాని నాయకత్వ లక్షణాలను పునికిపుచ్చుకున్నారు. అందుకే ఆయన తన 21వ ఏట అంటే, 1986లో జనతా పార్టీ అభ్యర్థిగా మోండా మార్కెట్ కార్పొరేటర్‌గా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో తలసాని ఓడిపోయారు. అనంతరం తలసాని తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన నాయకత్వ లక్షణాలు, ఫాలోయింగ్‌ను గుర్తించిన ఎన్టీఆర్ 1994లో సికింద్రాబాద్ అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తోలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తలసాని విజయం సాధించి.. చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో మంత్రిగా చేరారు.
ఒడిదొడుకులకు లోనైన తలసాని పొలిటికల్ కెరీర్
2004 తర్వాత ఉవ్వెత్తిన ఎగిసిన తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో హైదరాబాద్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి టి. పద్మారావు గౌడ్ చేతిలో తలసాని ఓడిపోయారు. అయితే 2008 వచ్చిన ఉప ఎన్నికల్లో తలసాని మళ్లీ విజయం సాధించారు. కానీ, 2009లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటి జయసుధ చేతిలో ఓడిపోయారు. వరుస ఓటములతో తలసాని రాజకీయ జీవితం కాస్త ఒడిదొడులకు లోనైంది.
ప్రత్యేక రాష్ట్రంలో తలసాని హవా..
తెలంగాణ ఏర్పడిన తర్వాత తలసాని రాజకీయ కెరీర్ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సనత్ నగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తలసాని విజయం సాధించారు. ఆ తర్వాత కొన్నిపరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తలసాని టీఆర్ఎస్‌లో చేరారు. తర్వాత కేబినెట్‌లో మంత్రి అయ్యారు. 2018లోనూ టీఆర్ఎస్ అభ్యర్థిగా సనత్ నగర్ నుంచి పోటీ చేసి మళ్లీ విజయం సాధించారు. ఈ సారి కూడా తలసానిని కేసీఆర్ తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు మంత్రి అయిన అతి కొద్ది మంది నేతల్లో తలసాని ఒకరిగా నిలిచారు. 2023అసెంబ్లీ ఎన్నికల్లోనూ సనత్ నగర్ నుంచే తలసాని బరిలో నిలిచారు.