LOADING...
Forbes Asia: ఫోర్బ్స్‌ ఆసియా 30 అండర్‌-30లో చోటు.. యువతుల ప్రతిభకు ప్రపంచ గుర్తింపు
ఫోర్బ్స్‌ ఆసియా 30 అండర్‌-30లో చోటు.. యువతుల ప్రతిభకు ప్రపంచ గుర్తింపు

Forbes Asia: ఫోర్బ్స్‌ ఆసియా 30 అండర్‌-30లో చోటు.. యువతుల ప్రతిభకు ప్రపంచ గుర్తింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2026
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

సమాజంలో సమస్యలను చూసి బాధపడేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ వాటికి పరిష్కారాలు కనుగొనేందుకు ముందడుగు వేసేవాళ్లు మాత్రం కొందరే. అలాంటి యువతుల్లో కొందరు తమ ప్రతిభ, వినూత్న ఆలోచనలతో మార్పు కోసం కృషి చేసి విజయాలను అందుకున్నారు. అందుకే వారు సాధారణ వ్యక్తులుగా కాకుండా ఫోర్బ్స్‌ ఆసియా 30 అండర్‌-30 జాబితాలో స్థానం సంపాదించారు.

వివరాలు

పర్యావరణ హిత ఉత్పత్తులకు 'మ్యూలా'

భూమిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదేననే భావనతో యువత ముందుకు వస్తోంది. ముఖ్యంగా జెన్‌జీ, మిలీనియల్స్‌ పర్యావరణహిత జీవనశైలిని అవలంబించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే అలాంటి ఉత్పత్తులు కొనుగోలు చేయాలంటే అధిక ధరలు చెల్లించాల్సి రావడం, కొన్ని సందర్భాల్లో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం వంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా 24 ఏళ్ల ఇషితా 'మ్యూలా' అనే సంస్థను ప్రారంభించారు. పర్యావరణహిత ఉత్పత్తులకు అమెజాన్‌లాంటి వేదికగా ఇది పనిచేస్తోంది. 2022లో ప్రారంభమైన ఈ సంస్థ బ్యూటీ, హెల్త్‌కేర్‌, ఫ్యాషన్‌, ఆహారం, గృహోపకరణాలు తదితర విభాగాల్లో పర్యావరణహిత ఉత్పత్తులు తయారు చేసే సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువస్తోంది. అంతేకాకుండా ఆయా విభాగాల్లో సొంత బ్రాండ్లను కూడా అందుబాటులోకి తెస్తోంది.

వివరాలు

పర్యావరణహిత జీవన విధానాన్నే కొనసాగించాలి

మ్యూలా వేదికపైకి ఏ బ్రాండ్‌ను తీసుకురావాలన్నా ముందుగా దాని ఉత్పత్తులను క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ప్రమాణాలు, ముడి పదార్థాల నాణ్యతపై పూర్తిస్థాయి సంతృప్తి పొందిన తర్వాతే వాటికి చోటు కల్పిస్తారు. ''మనకంటే ఒక తరం ముందు వరకు ప్రజలు సహజసిద్ధమైన, పర్యావరణహిత జీవన విధానాన్నే అనుసరించారు. ఆ తర్వాత ప్రకృతిపై దాడి పెరిగింది. దాన్ని మార్చేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. మా ఉత్పత్తులకు లభిస్తున్న ఆదరణే అందుకు నిదర్శనమని ఇషితా చెబుతున్నారు. గత ఏడాది జనరల్‌ అనలిటిక్స్‌ సంస్థ మ్యూలాలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టింది.

Advertisement

వివరాలు

లాక్‌డౌన్‌లో కనిపించిన సమస్యకు 'ఫెమీసేఫ్‌'

కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో చెత్త సేకరణలో ఎదురైన సమస్యలు నౌరీన్‌ ఆయేషాను ఆలోచింపజేశాయి. చెత్త సేకరించే సిబ్బంది వారానికి ఒకసారి మాత్రమే రావడం, వీధులు చెత్తతో నిండిపోవడం, వాడిన శానిటరీ ప్యాడ్లను చేతులతో సేకరించడం వల్ల వారు పడుతున్న ఇబ్బందులు ఆమె దృష్టికి వచ్చాయి. కేరళలోని కోజికోడ్‌కు చెందిన నౌరీన్‌ దుబాయి, ముంబయిలో పెరిగారు. హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేసిన ఆమె ఏవియేషన్‌ సంస్థలో ఆపరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌గా, మహీంద్రాలో హెచ్‌ఆర్‌గా పనిచేశారు. లాక్‌డౌన్‌లో సింథటిక్‌ శానిటరీ ప్యాడ్ల వల్ల మహిళల ఆరోగ్యానికే కాకుండా వాటిని సేకరించే సిబ్బందికి, పర్యావరణానికీ కలుగుతున్న నష్టాన్ని గమనించిన నౌరీన్‌ పరిష్కారం కోసం ప్రయత్నించారు. 2020లో కొచ్చిలో 'ఫెమీసేఫ్‌' అనే మహిళల ఆరోగ్య స్టార్టప్‌ను ప్రారంభించారు.

Advertisement

వివరాలు

అనేక సమస్యలకు పరిష్కారం

ఈ సంస్థ నెలసరి ఉత్పత్తులతో పాటు మహిళలు రోజువారీగా ఎదుర్కొనే అనేక సమస్యలకు పరిష్కారాలను అందిస్తోంది. నెలసరి సమయంలో పరిశుభ్రత, మెన్‌స్ట్రువల్‌ కప్‌ల వినియోగం, లైంగిక ఆరోగ్యం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తోంది. నౌరీన్‌ టెడెక్స్‌ స్పీకర్‌గా కూడా గుర్తింపు పొందారు. కేరళ ముఖ్యమంత్రి సహకారంతో 'ప్యాడ్‌ ఫ్రీ కేరళ' ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్‌ ఇంపాక్టర్‌ సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆమె సంస్థ దేశంలోని టాప్‌-100 డీ2సీ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది.

వివరాలు

ఫోర్బ్స్‌ జాబితాలో తెలుగమ్మాయి

హైదరాబాద్‌కు చెందిన భవిత మండవ అంతర్జాతీయ ఫ్యాషన్‌ రంగంలో విశేష గుర్తింపు సంపాదించారు. న్యూయార్క్‌ యూనివర్సిటీ నుంచి డిజైన్‌ అండ్‌ మీడియాలో మాస్టర్స్‌ పూర్తి చేసిన ఆమె సబ్‌వే మోడల్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రఖ్యాత ఫ్యాషన్‌ సంస్థ షనెల్‌ నిర్వహించిన మెటియర్స్‌ డి ఆర్ట్‌ 2026 షోలో ఓపెనింగ్‌ వాక్‌ చేసిన తొలి భారతీయ మోడల్‌గా భవిత చరిత్ర సృష్టించారు. అనంతరం షనెల్‌ హౌజ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. బ్రిటిష్‌ వోగ్‌ కవర్‌పేజీపై కూడా ఆమె మెరిశారు. ఇటీవల జరిగిన మెట్‌ గాలాలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఛామన ఛాయతోనూ అందానికి కొత్త నిర్వచనం చెబుతూ, అంతర్జాతీయ వేదికపై భారతీయ మహిళల ప్రతిభను చాటుతూ భవిత మండవ ముందుకు సాగుతున్నారు.

Advertisement