LOADING...
IPL 2026: ఐపీఎల్‌ 2026లో అరుదైన ఘనతలు.. సరికొత్త రికార్డులతో మెరిసిన సీజన్
ఐపీఎల్‌ 2026లో అరుదైన ఘనతలు.. సరికొత్త రికార్డులతో మెరిసిన సీజన్

IPL 2026: ఐపీఎల్‌ 2026లో అరుదైన ఘనతలు.. సరికొత్త రికార్డులతో మెరిసిన సీజన్

వ్రాసిన వారు Moogati Shabari
May 30, 2026
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2026 సీజన్‌ అనేక విశేషాలకు, అరుదైన రికార్డులకు వేదికగా నిలిచింది. తాజాగా జరిగిన రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌తో పాటు మొత్తం సీజన్‌లో పలు చారిత్రాత్మక రికార్డులు నమోదయ్యాయి. వాటిపై ఒకసారి దృష్టి పెడదాం. ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారిగా ఒకే సీజన్‌లో ముగ్గురు బ్యాటర్లు 700కు పైగా పరుగులు నమోదు చేశారు. ఈ సీజన్‌లో వైభవ్‌ సూర్యవంశీ 776 పరుగులు, శుభమన్ గిల్‌ 722 పరుగులు, సాయి సుదర్శన్‌ 710 పరుగులతో ఈ ఘనత సాధించారు.

వివరాలు

ఒకే జట్టులో ఇద్దరు బ్యాటర్లు రికార్డు..

విశేషం ఏమిటంటే, గిల్‌, సాయి సుదర్శన్‌ ఇద్దరూ గుజరాత్‌ టైటాన్స్‌కు చెందిన ఆటగాళ్లు కావడం. ఒకే జట్టుకు చెందిన ఇద్దరు బ్యాటర్లు 700కు పైగా పరుగులు చేయడం కూడా ఇదే తొలిసారి. ఒకే సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా వైభవ్‌ సూర్యవంశీ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ ఎడిషన్‌లో అతడు ఏకంగా 72 సిక్స్‌లు కొట్టి ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చాటాడు. ఈ గణాంకానికి మరే ఇతర బ్యాటర్‌ కూడా చేరువ కాలేకపోయాడు. ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో సెంచరీ నమోదు చేసిన తొలి, ఏకైక కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో అతడు 104 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

వివరాలు

ప్లేఆఫ్స్‌ చరిత్రలో తొలిసారి..

ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన మ్యాచ్‌గా ఈ పోరు నిలిచింది. రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్‌ టైటాన్స్‌ కేవలం 18.4 ఓవర్లలోనే అందుకుంది. ఇంతకుముందు పంజాబ్‌ కింగ్స్‌ ముంబయి ఇండియన్స్‌పై ఛేదించిన 204 పరుగుల లక్ష్యం అత్యధికంగా ఉండేది. సాయి సుదర్శన్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్‌ వికెట్‌గా ఔటవడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఐపీఎల్‌ కెరీర్‌లో అతడు ఇప్పటివరకు మూడుసార్లు హిట్‌ వికెట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు.

Advertisement

వివరాలు

టోర్నీ చరిత్రలో ప్రత్యేక స్థానం..

ఒకే సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా వైభవ్‌ సూర్యవంశీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్‌ ప్లేఆఫ్స్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనే అతడు 19 సిక్స్‌లు కొట్టి కొత్త ప్రమాణాన్ని నెలకొల్పాడు. ఈ విధంగా ఐపీఎల్‌ 2026 సీజన్‌ అనేక అరుదైన ఘనతలు, చారిత్రాత్మక రికార్డులతో అభిమానులను అలరించడంతో పాటు టోర్నీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.

Advertisement