Pawan Kalyan: గ్రామ పంచాయతీల క్లస్టర్ విభజనకు కమిటీ ఏర్పాటు : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఈ వార్తాకథనం ఏంటి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని సూచించారు.
పంచాయతీ శాఖలో సిబ్బంది లేమి సమస్యను అధిగమించడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తూ, గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టాలని అన్నారు.
కొత్త మార్గదర్శకాలను రూపొందించి, గ్రామ పంచాయతీల క్లస్టర్ గ్రేడ్ల విభజనలో ఆదాయంతో పాటు జనాభాను కూడా ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆదాయం అధికంగా ఉన్న పంచాయతీలలో జనాభా తక్కువగా ఉండడం, ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా ఎక్కువగా ఉండే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, సమస్యలను నివారించేందుకు అనుగుణంగా క్లస్టర్ గ్రేడ్లను విభజించాలన్నారు.
Details
ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ సజావుగా జరగాలి
గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుని కొత్త క్లస్టర్ విధానంలో సిబ్బంది నియామకం చేపట్టాలని సూచించారు.
గ్రామ పంచాయతీల ప్రాథమిక బాధ్యతలైన తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య మెరుగుదల వంటి కార్యకలాపాల కోసం తగినంత మంది సిబ్బందిని అందుబాటులో ఉంచాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణను సజావుగా కొనసాగించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.