Page Loader
Bharat Ratna: బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు 'భారతరత్న'
Bharat Ratna: బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు 'భారతరత్న'

Bharat Ratna: బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు 'భారతరత్న'

వ్రాసిన వారు Stalin
Jan 23, 2024
09:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్వాతంత్య్ర సమరయోధుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. బుధవారం కర్పూరీ ఠాకూర్ 100వ జయంతి సందర్భంగా ఆయనకు మరణానంతరం భారతరత్నతో సత్కరించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వాలని జేడీయూ గతంలో డిమాండ్ చేసింది. ఇప్పుడు ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడంతో మోదీ ప్రభుత్వానికి జేడీయూ కృతజ్ఞతలు తెలిపింది. తన తండ్రికి భారతరత్న ప్రకటించడంపై కర్పూరీ ఠాకూర్ కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్ స్పందించారు. 36 ఏళ్ల ప్రయత్నం ఫలించిందన్నారు. తన కుటుంబంతో పాటు, 15 కోట్ల మంది బిహార్ ప్రజల తరపున కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

భారతరత్న

కర్పూరి ఠాకూర్ ఎవరు?

కర్పూరి ఠాకూర్ సమస్తిపూర్ జిల్లాలోని పితౌజియా గ్రామంలో 1924 జనవరి 24న జన్మించారు. 1940లో పాట్నా నుంపవ మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై స్వాతంత్య్ర ఉద్యమంలోకి క్రియాశీలకంగా పాల్గొన్నారు. కర్పూరి ఠాకూర్ ఆచార్య నరేంద్ర దేవ్‌తో కలిసి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సోషలిజం మార్గాన్ని కర్పూరి ఠాకూర్ ఎంచుకున్నారు. 1942లో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన కొంతకాలం జైళ్లో కూడా ఉన్నారు. 1945లో జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత, కర్పూరీ ఠాకూర్ క్రమంగా సోషలిస్టు ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారారు. ఒకవైపు స్వాతంత్య్ర పోరాటం చేస్తూనే.. సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఉద్యోమించారు.

బిహార్

1952లో తొలిసారి ఎమ్మెల్యే

కర్పూరి ఠాకూర్ 1952లో తాజ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1967 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఠాకూర్ నాయకత్వంలో ఒక ప్రధాన శక్తిగా ఉద్భవించింది. దీని ఫలితంగా బిహార్‌లో మొదటిసారిగా కాంగ్రెసేతర పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెసేతర ప్రభుత్వంలో మహామాయ ప్రసాద్ సిన్హా ముఖ్యమంత్రి కాగా.. కర్పూరి ఠాకూర్ ఉపముఖ్యమంత్రి అయ్యారు. విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలకు కర్పూరి ఠాకూర్ శ్రీకారం చుట్టారు. కర్పూరీ ఠాకూర్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యార్థుల ఫీజులను రద్దు చేయడంతోపాటు ఇంగ్లీషు నిబంధనను కూడా రద్దు చేశారు.

బిహార్

రైతులకు ఉపయోగపడేలా పన్నును రద్దు చేసిన కర్పూరి ఠాకూర్‌

బిహార్‌లో కర్పూరి ఠాకూర్‌ని జననాయక్‌ అని పిలుస్తారు. మహామాయ ప్రసాద్ సిన్హా అనంతరం బిహార్ సీఎంగా కర్పూరీ ఠాకూర్‌ ఎన్నికయ్యారు. డిసెంబర్ 1970 నుంచి జూన్ 1971 వరకు కర్పూరీ ఠాకూర్‌ సీఎంగా పని చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు సిఎం పదవిని నిర్వహించారు. సోషలిస్ట్ పార్టీ, భారతీయ క్రాంతి దళ్ ప్రభుత్వంలో తొలిసారి సీఎం కాగా, రెండోసారి జనతా పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్పూరీ ఠాకూర్‌ రైతులకు ఉపయోగించే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు పన్నును రద్దు చేశారు.

బిహార్

వెనుకబడిన తరగతులకు 27 శాతం రిజర్వేషన్ కల్పించిన ఠాకూర్

తన హయాంలోనే ఠాకూర్ ఉర్దూకు రాష్ట్ర భాష హోదాను కూడా ఇచ్చారు. వెనుకబడిన తరగతులకు 27 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఈ నిర్ణయం తర్వాత అతని రాజకీయ శక్తి బాగా పెరిగింది. ఫిబ్రవరి 17, 1988న కర్పూరి ఠాకూర్ మరణించారు. తన హయాంలో అతను బిహార్‌లో గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందారు. మాజీ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ తర్వాత.. బిహార్ నుంచి భారతరత్న పొందిన రెండో రాజకీయ నాయకుడు కర్పూరి ఠాకూర్ కావడం గమనార్హం. లోక్‌నాయక్ జైప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా శిష్యుడిగా బిహార్ రాజకీయాల్లో ఠాకూర్‌ తనదైన ముద్ర వేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని మోదీ ట్వీట్