Mamata Banerjee:రాజకీయ కార్యక్రమాలకు సెలవు ఇచ్చి..నేతాజీ జయంతికి ఎందుకు ఇవ్వరు?: మమతా బెనర్జీ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించడంలో విముఖత చూపుతున్న కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేతాజీ 127వ జయంతి సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మమతా మాట్లాడారు. గత 20ఏళ్లుగా నేతాజీ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కానీ తన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లు పేర్కొన్నారు. రాజకీయ కార్యక్రమాలకు సెలవు ప్రకటించే కేంద్ర ప్రభుత్వం.. దేశం కోసం పోరాడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నాడు సెలవు ప్రకటించకపోవడం సిగ్గు చేటన్నారు. రామమందిర ప్రారంభోత్సవాన్ని 'రాజకీయ' కార్యక్రమం అంటూ మమతా బెనర్జీ స్పష్టంగా పేర్కొన్నారు. రాజకీయ ప్రచారం కోసమే జనవరి 22న సెలవు మంజూరు చేశారని కేంద్రంపై విరుచుకుపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై మమతా ధ్వజం
కేంద్ర ప్రభుత్వ విధానాలను సైతం మమతా బెనర్జీ టార్గెట్ చేశారు. నేతాజీ ప్రణాళికా సంఘాన్ని సృష్టించారని, అయితే కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిందన్నారు. ప్రణాళికా సంఘం పేరును నీతి ఆయోగ్‌గా మార్చారని, ఈరోజు దేశానికి ప్లానింగ్ కమిషన్ ఎందుకు లేదని మమతా బెనర్జీ ప్రశ్నించారు. నీతి ఆయోగ్‌ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, కానీ నేడు దానికి ఎలాంటి విధానం లేదని మమతా బెనర్జీ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందే నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకున్నారని మమతా బెనర్జీ అన్నారు. నేతాజీ అదృశ్యం వెనుక మిస్టరీని ఛేదించడంలో చొరవ చూపడం లేదని మోదీ ప్రభుత్వం ధ్వజమెత్తారు.