దిల్లీ మెట్రో- అరవింద్ టెక్నో మధ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ నియామకం
దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ), అరవింద్ టెక్నో గ్లోబ్ జేవీ మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను దిల్లీ హైకోర్టు మధ్యవర్తిగా నియమించింది. జస్టిస్ చంద్ర ధారి సింగ్ మార్చి 6న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు వర్గాల మధ్య వివాదాల పరిష్కారానికి స్వతంత్ర ఏకైక మధ్యవర్తిగా జస్టిస్ రమనను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వివాదం పరిష్కరించడానికి దిల్లీ కోర్టు చేసిన ప్రయత్నాలు విఫలం
మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది దిల్లీ, కేంద్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్. అయితే దిల్లీ మెట్రో విస్తరణకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను జూలై 22, 2013న అరవింద్ టెక్నో గ్లోబ్ జేవీ అనే సంస్థ పొందింది. అయితే కాంట్రాక్ట్ పొందిన సంస్థ నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయలేదు. 27నెలల ఆసల్యంగా పనులు పూర్తి చేశారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య వివాదాలు తలెత్తాయి. అలాగే బిల్లులు చెల్లింపు విషయంలో కూడా వివాదం తలెత్తింది. క్లెయిమ్ మొత్తాన్ని విడుదల చేయడంలో డీఎంఆర్‌సీ విఫలమయ్యారని అరవింద్ టెక్నో దిల్లీ కోర్టును ఆశ్రయించింది. వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి దిల్లీ కోర్టు చేసిన ప్రయత్నాలు విఫలమైనందున మధ్యవర్తిని నియమించింది.