పురుషుడిలా మారనున్న బెంగాల్ మాజీ సీఎం కూతురు
పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సంచలన నిర్ణయం ప్రకటించారు. తాను పురుషుడిలాగా మారిపోవాలని అనుకుంటున్నట్లు సుచేతన భట్టాచార్య వెల్లడించారు. ఈ మేరకు లింగమార్పిడి చేయించుకునే ఆలోచన ఉందని తెలిపారు. చిన్నప్పట్నుంచి తాను పురుషుడి లాగా జీవించానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పుట్టుకతోనే తాను మహిళ అయినా ప్రస్తుతం శారీరకంగా మగాడిలా మారేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఇటీవలే సుచేతన ఓ ఎల్జీబీటీక్యూ వర్క్ షాప్ నకు హాజరయ్యారు. అనంతరం ఈ విషయంపై ఇంటికెళ్లి ఆలోచించానన్నారు. ఈ మేరకు తనకు పూర్తి అవగాహన వచ్చిందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే లింగ మార్పిడి నిర్ణయం తీసుకున్నానని వివరించారు.
ఫిజికల్ గానూ మగవాడిగా మారాలని అనుకుంటున్నాను : సుచేతన భట్టాచార్య
ఈ అంశంపై తాను లీగల్ అడ్వైజర్లు, వైద్య నిపుణుల సలహాలు తీసుకున్నానని సుచేతన భట్టాచార్య తెలిపారు. తాను పురుషుడిగా మారాక తన పేరులో మార్పులు చేయనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో సుచేతన భట్టాచార్య కాస్త సుచేతన్ భట్టాచార్యగా మారనుందన్నారు. ఇప్పుడు తన వయసు 41 ఏళ్లు అని, తన జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా తాను తీసుకోగలనన్నారు. తన ఆలోచనలు, నిర్ణయాల కారణంగా తల్లిదండ్రులతో సహా ఇతర కుటుంబీకులకు ఏ సమస్య లేదన్నారు. ఈ విషయమై తన తల్లిదండ్రులను ఎలాంటి వివాదాల్లోకి లాగొద్దని అభ్యర్థించారు. మానసికంగా తనను తాను పురుషుడిగానే భావిస్తున్నానన్నారు. ఇప్పుడు ఫిజికల్ గానూ మగవాడిగా మార్పులను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు.