Loading...
Sajjan Kumar: మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్ కుమార్ కన్నుమూత..
మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్ కుమార్ కన్నుమూత..

Sajjan Kumar: మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్ కుమార్ కన్నుమూత..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2026
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ కాంగ్రెస్ ఎంపీ,ఆ పార్టీ సీనియర్ నేత సజ్జన్ కుమార్(80)కన్నుమూశారు. గురువారం ఆయనను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకురాగా.. అప్పటికే మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ఏఎన్‌ఐకి తెలిపాయి. ఢిల్లీ రాజకీయాల్లో ఒకప్పుడు ప్రముఖ నేతగా ఉన్న సజ్జన్ కుమార్.. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన కేసుల్లో చాలా కాలంగా న్యాయపరమైన విచారణలు ఎదుర్కొన్నారు. సజ్జన్ కుమార్ మృతి.. 1984అల్లర్ల కేసులో ఢిల్లీ కోర్టు ఆయనను ఓకేసులో నిర్దోషిగా ప్రకటించిన కొన్ని నెలలకే చోటుచేసుకుంది. జనవరి 22,2026న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జానక్‌పురిలో సోహన్ సింగ్,ఆయన అల్లుడు అవ్తార్ సింగ్ హత్యలు,వికాస్‌పురిలో గురుచరణ్ సింగ్‌ను సజీవ దహనం చేశారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో సజ్జన్ కుమార్‌ను నిర్దోషిగా ప్రకటించింది.

వివరాలు 

సజ్జన్ కుమార్‌కు ఊరట.. తీర్పుపై హైకోర్టులో అప్పీల్

ఈ కేసులో సజ్జన్ కుమార్ ఘటనాస్థలంలో ఉన్నట్లు లేదా నేరంలో ఆయనకు సంబంధం ఉన్నట్లు అనుమానానికి తావులేకుండా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంది.

నేరం జరిగిన సమయంలో ఆయన అక్కడ ఉన్నారనే విషయానికి విశ్వసనీయ ఆధారాలు లేవని తెలిపింది.

అలాగే అక్రమంగా గుమిగూడిన గుంపులో ఆయన పాల్గొన్నట్లు,ఇతరులను రెచ్చగొట్టినట్లు,కుట్రకు పాల్పడినట్లు లేదా నేరానికి సహకరించినట్లు నిరూపించే బలమైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

అయితే ఈ నిర్దోషిత్వ తీర్పును 1984 అల్లర్ల బాధితుడు మంజిత్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు.

ఈ అప్పీల్‌పై మే 2026లో ఢిల్లీ హైకోర్టు సజ్జన్ కుమార్‌కు నోటీసులు జారీ చేసింది.

వివరాలు 

సజ్జన్ కుమార్ నిర్దోషిత్వంపై హైకోర్టులో సవాల్

న్యాయమూర్తులు ప్రతిభా ఎం.సింగ్,మధు జైన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును సెప్టెంబర్ 29న విచారించేందుకు జాబితా చేసింది.

ట్రయల్ కోర్టు సాక్షుల వాంగ్మూలాలను, ప్రత్యక్ష,పరిస్థితుల ఆధారాలను సరిగ్గా పరిశీలించలేదని అప్పీల్‌లో పేర్కొన్నారు.

గురుచరణ్ సింగ్, సోహన్ సింగ్, అవ్తార్ సింగ్ మరణాల్లో సజ్జన్ కుమార్ పాత్రకు సంబంధించిన ఆధారాలను కోర్టు సరిగా అంచనా వేయలేదని పిటిషనర్ వాదించారు.

ప్రాసిక్యూషన్ ఆయన పాత్రను నిరూపించిందని కూడా అప్పీల్‌లో పేర్కొన్నారు.

ఈ కేసులు 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సిక్కు భద్రతా సిబ్బంది అక్టోబర్ 31న హత్య చేసిన తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింసకు సంబంధించినవి.

ADVERTISEMENT

వివరాలు 

దశాబ్దాల తర్వాత తిరిగి తెరపైకి 1984 అల్లర్ల కేసులు

దశాబ్దాల తర్వాత జస్టిస్ జీపీ మాథుర్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం 114 కేసులను తిరిగి విచారించే ప్రక్రియను చేపట్టింది.

జానక్‌పురి కేసులో 1984 నవంబర్ 1న సోహన్ సింగ్, ఆయన అల్లుడు అవ్తార్ సింగ్ హత్యకు గురయ్యారు.

ఇక వికాస్‌పురి పోలీస్ స్టేషన్‌లో నమోదైన మరో కేసు నవంబర్ 2న గురుచరణ్ సింగ్‌ను సజీవ దహనం చేశారన్న ఆరోపణలకు సంబంధించినది.

ఈ రెండు కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లు 1992లో నమోదయ్యాయి. అనంతరం రెండు ఎఫ్‌ఐఆర్‌లకు కలిపి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

అయితే జనవరి 2026లో వెలువడిన తీర్పు జానక్‌పురి ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించినది. వికాస్‌పురి కేసులో సజ్జన్ కుమార్‌ను కోర్టు డిశ్చార్జ్ చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

జ్జన్ కుమార్‌పై అభియోగాలు.. ఆరోపణలను ఖండించిన మాజీ ఎంపీ

అల్లర్లు, వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం,ఆస్తులకు నష్టం కలిగించడం, హత్యాయత్నం, హత్య, నేరపూరిత కుట్ర తదితర ఐపీసీ సెక్షన్ల కింద సజ్జన్ కుమార్‌పై అభియోగాలు మోపారు.

2023 ఆగస్టులో ట్రయల్ కోర్టు ఆయనపై అభియోగాలు నమోదు చేసింది.

అయితే సంబంధిత ఘటనలో ఐపీసీ సెక్షన్ 302కింద హత్య ఆరోపణ నుంచి మాత్రం ఆయనను డిశ్చార్జ్ చేసింది.

1984 నవంబర్ 1న గులాబ్ బాగ్,నవాడాలోని ఓ గురుద్వారా సమీపంలో అక్రమంగా ఓ గుంపు గుమిగూడినట్లు తన ముందున్న ఆధారాలు ప్రాథమికంగా సూచిస్తున్నాయని అప్పట్లో కోర్టు పేర్కొంది.

అయితే తనపై వచ్చిన ఆరోపణలను సజ్జన్ కుమార్ ఖండించారు.

అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో తాను లేనని,తనను తప్పుడు కేసులో ఇరికించారని విచారణ సందర్భంగా తన వాంగ్మూలంలో తెలిపారు.

వివరాలు 

సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు

ఈ కేసులో విచారణ సెప్టెంబర్ 23న ముగియగా.. తీర్పును డిసెంబర్ 22న రిజర్వ్ చేశారు.

ఇదిలా ఉండగా.. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన మరో కేసులో సజ్జన్ కుమార్ గతంలోనే దోషిగా తేలారు.

ఆ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. ఈ శిక్షను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.

తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తనపై వచ్చిన ఆరోపణల్లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని సజ్జన్ కుమార్ మొదటి నుంచీ చెబుతూ వచ్చారు.

జనవరి 2026లో తీర్పు వెలువడిన కేసులోనూ తనకు, ఘటనలకు మధ్య సంబంధాన్ని చూపించే ఆధారాలు లేవని ఆయన వాదించారు.

ADVERTISEMENT