HMDA Ex Director: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్ట్
హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో అరెస్టయ్యారు. అయన ఇంట్లో సోదాలు చేయగా, భారీ మొత్తంలో ఆస్తులు కనుగొన్నారు. ఆయనను అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. ఈరోజు అతడిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. బాలకృష్ణ ఇంట్లో సోదాలు ముగియగా, మరో నాలుగు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా, అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) అధికారులు అతని బ్యాంక్ లాకర్లను తెరవనున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారితో సన్నిహితంగా ఉంటూ బాలకృష్ణ తన పదవిని అడ్డుపెట్టుకొని దాదాపు రూ. 500 కోట్ల అక్రమ ఆస్తులు సంపాదించారు. ఆయనపై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది.
ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 100 కోట్లు
ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల్లో రూ. 40 లక్షల నగదు, ఐదు కోట్ల విలువైన బంగారం, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, 70 ఎకరాల భూమి, ఇళ్లు, 60 ఖరీదైన వాచీలు, 100 మొబైల్ ఫోన్లు, నాలుగు కార్లు, పది ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. అంతేకాదు బాలకృష్ణ నివాసంలో నగదు లెక్కింపు యంత్రాలు ఉండడం గమనార్హం. అతని బ్యాంకు లాకర్లు తెరిచి, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపిన తర్వాత మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బాలకృష్ణతో సంబంధం ఉన్న అధికారులను ప్రశ్నిస్తామని ఏసీబీ ప్రకటించింది. బుధవారం సాయంత్రం నాటికి బయటపడ్డ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 100 కోట్లు.