Page Loader
Karnataka: కర్ణాటకలో దారుణం.. మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ హత్య.. భార్యే హంతకురాలు!

Karnataka: కర్ణాటకలో దారుణం.. మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ హత్య.. భార్యే హంతకురాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 21, 2025
08:03 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక రాష్ట్రానికి మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)గా సేవలందించిన ఓం ప్రకాశ్‌ (వయస్సు 68) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు కారణం కుటుంబ సమస్యలు, ఆస్తి వివాదాలేనని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ కేసులో ఓం ప్రకాశ్‌ భార్య పల్లవి ప్రధాన నిందితురాలిగా భావిస్తున్నారు. ఓం ప్రకాశ్‌ 1981 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన బిహార్‌ రాష్ట్రంలోని చంపారన్‌ ప్రాంతానికి చెందినవారు. 2015 మార్చి 1న కర్ణాటక రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించి, 2017లో పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ అనంతరం బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌లో నివసిస్తున్నారు.

వివరాలు 

ఓం ప్రకాశ్‌, భార్య పల్లవి మధ్య ఆస్తి సంబంధిత వివాదాలు

ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఓం ప్రకాశ్‌ భార్య పల్లవి పోలీసులకు సమాచారం అందించడంతో వారు అతని నివాసానికి వెళ్లారు. ఇంట్లో రక్తపు మడుగులో పడివున్న ఓం ప్రకాశ్‌ను గుర్తించిన వారు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇటీవలి కాలంలో ఓం ప్రకాశ్‌, ఆయన భార్య పల్లవి మధ్య ఆస్తి సంబంధిత వివాదాలు ఎక్కువయ్యాయి. ఇతర కుటుంబ సభ్యుల మధ్యనూ విభేదాలు తలెత్తాయి. కొద్ది రోజుల క్రితం ఓం ప్రకాశ్‌ ఇంటి వద్ద పల్లవి ఆందోళనకు దిగిన సంఘటన మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

వివరాలు 

పోలీసుల అదుపులో మృతుడి భార్య పల్లవి, కుమార్తె, కోడళ్ళు 

పల్లవి 'ఐపీఎస్‌ ఫ్యామిలీ గ్రూప్‌'లో తన భర్త ఓం ప్రకాశ్‌ తరచూ కుటుంబాన్ని వేధిస్తున్నారని, తుపాకీతో ఇంట్లో తిరుగుతూ భయాందోళనలు కలిగిస్తున్నారని మెసేజ్‌లు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం ఉదయం ఘర్షణ తీవ్ర స్థాయికి చేరడంతో పల్లవి ఓం ప్రకాశ్‌ను పలుమార్లు కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ఆమె "ఐ హ్యావ్‌ ఫినిష్డ్‌ మాన్‌స్టర్‌" అనే సందేశాన్ని పంపినట్టు తెలిపారు. ఈ సంఘటనపై డీజీపీ అలోక్‌ మోహన్‌, బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ బి. దయానంద్‌ హత్య స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ప్రస్తుతం మృతుడి భార్య పల్లవి, కుమార్తె, కోడళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.