Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ సీఎం, అతని కుమారుడు!
లోక్‌సభ ఎన్నికలకు వేళ.. కాంగ్రెస్ పార్టీని వీడే సీనియర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ (Kamal Nath) , అతని తనయుడు నకుల్‌నాథ్ బీజేపీ (BJP)లో చేరవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నకుల్‌నాథ్ తన 'ఎక్స్(ట్విట్టర్)' బయో నుంచి కాంగ్రెస్ (Congress) పేరును తొలగించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు చెందిన ఏకైక ఎంపీ నకుల్‌నాథ్ (Nakul Nath) కావడం గమనార్హం. ఎన్నికల వేళ.. ఉన్న ఒక్క ఎంపీ కూడా పార్టీని వీడితే కాంగ్రెస్ తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దిల్లీకి బయలుదేరిన కమల్ నాథ్, నకుల్ నాథ్
ఇదిలా ఉంటే, కమల్ నాథ్, నకుల్ నాథ్‌లు ఇద్దరు హడావుడిగా దిల్లీకి బయలుదేరారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు నేతలు దిల్లీలో బీజేపీ అగ్రనేతలతో భేటీ కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శనివారం దిల్లీలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం పూర్తయ్యాక కమల్ నాథ్ బీజేపీ పెద్దలతో సమావేశమై.. కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే కమల్ నాథ్ మాత్రం బీజేపీ చేరుతున్నారన్న వార్తలపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కమల్‌నాథ్ బీజేపీలోకి వస్తున్నారన్న వార్తలపై మధ్యప్రదేశ్ పార్టీ చీఫ్ వీడీ శర్మ స్పందించారు. కమల్‌నాథ్, నకుల్‌నాథ్‌లు బీజేపీలో చేరాలనుకుంటే స్వాగతిస్తామన్నారు.
వార్తలను ఖండించిన దిగ్విజయ్ సింగ్
కమల్‌నాథ్ బీజేపీలో చేరనున్నారనే వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఖండించారు. నిన్న రాత్రి కమల్‌నాథ్‌తో తాను మాట్లాడినట్లు చెప్పారు. ఆయన చింద్వారాలో ఉన్నారన్నారు. గాంధీ కుటుంబంతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన, ఇందిరాజీ కుటుంబాన్ని ఆయన ఎలా విడిచిపెడతారన్నారు. చింద్వారా చాలా కాలంగా కమల్‌నాథ్ కుటుంబానికి బలమైన కోటగా ఉంది. ఇక్కడ నుంచి ఆయన కుటుంబం వరుసగా 9 సార్లు గెలిచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 29 స్థానాలకు గాను 28 స్థానాలను బీజేపీ గెలుచుకున్నప్పటికీ.. చింద్వారాలో మాత్రం గెలవలేకపోయింది. ఇప్పుడు బీజేపీ చూపు ఈ సీటుపై పడింది.