Ambati Rambabu: చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులో చోటు చేసుకున్న ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో అంబటి సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు, కూటమి శ్రేణులు భగ్గుమన్నాయి. గుంటూరు నవభారత్ నగర్‌లోని అంబటి రాంబాబు నివాసాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు ముట్టడించారు. దాదాపు ఆరు గంటలకు పైగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Details
పెద్ద సంఖ్యలో నిరసన తెలియజేసిన నాయకులు
ఆందోళనలో భాగంగా ఇంటిపై రాళ్లు రువ్వడంతో పాటు, అక్కడ నిలిపి ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో నిరసనకు దిగుతూ చెప్పులు, చీపుర్లతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య మాజీ మంత్రి అంబటి రాంబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.