Page Loader
ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్!
బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్

ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్!

వ్రాసిన వారు Stalin
Jan 27, 2023
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ తన కుమారుడు శిశిర్‌తో కలిసి బీజేపీని వీడి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో చేరనున్నట్లు ప్రకటించారు. అయితే వారు బీఆర్‌ఎస్‌లో చేరే తేదీని ప్రస్తావించనప్పటికీ, ఫిబ్రవరి 5వ తేదీన మహారాష్ట్ర నాందేడ్‌లో నిర్వహించే సభలో తండ్రీకొడుకులు బీఆర్ఎస్ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒడిశాలోని 147 అసెంబ్లీ నియోజకవర్గాలు, 21లోక్‌సభ స్థానాలు ఉండగా, అన్ని చోట్లా బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తున్నట్లు గిరిధర్ కుమారుడు శిశిర్ చెప్పారు. కోరాపుట్, నబరంగూర్, అస్కా, బెర్హంపూర్, కంధమాల్‌తో లోక్‌సభ స్థానాలతో పాటు వీటి పరిధిలోకి వచ్చే 35 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

ఒడిశా

ఆప్, లెఫ్ట్, ఆర్జేడీ, ఎస్పీతో ఒడిశాలో కూటమి: శిశిర్

2024సార్వత్రిక ఎన్నికల్లో ఒడిశాలో బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్‌లను వ్యతిరేకించే అన్ని పార్టీలు కొత్త రాజకీయ కూటమిగా ఏర్పడే అవకాశం ఉందని గిరిధర్ గమాంగ్ కుమారుడు శిశిర్ తెలిపారు. రాష్ట్రంలో అంతగా ఉనికిలేని పార్టీ ఇంత మంది అభ్యర్థులను ఎలా నిలబెడుతుందని విలేకరులు అడగ్గా, బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్‌ కాకుండా ఒకే అవగాహన కలిగిన ఇతర పార్టీలతో కలిసి అన్నిస్థానాల్లో అభ్యర్థులను నియమిస్తామని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, లెఫ్ట్ పార్టీలు, ఆర్జేడీ, ఎస్పీ, ఇతర ప్రాంతీయ పార్టీలు సంకీర్ణ భాగస్వాములు కావచ్చని ఆయన అన్నారు. తెలుగు మాట్లాడే జనాభా ఎక్కువగా ఉన్న దక్షిణ ఒడిశాపై బీఆర్‌ఎస్ దృష్టి సారిస్తుందని చెప్పారు. చంద్రశేఖర్‌రావుకు ఒడిశా సంస్కృతిపై లోతైన అవగాహన ఉందని శిశిర్ గమాంగ్ అన్నారు.