Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ కన్నుమూశారు. దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఇవాళ ఆయన తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో గురువారం సాయంత్రం అత్యవసరంగా దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారని ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. భారత రాజకీయ చరిత్రలో అత్యంత గౌరవనీయ నేతగా నిలిచిన డాక్టర్ మన్మోహన్ సింగ్ తన ప్రస్థానాన్ని ఆర్థిక శాస్త్రవేత్తగా ప్రారంభించారు. 1991లో ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ ఆర్థిక వ్యూహాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2004 నుండి 2014 వరకు రెండు పదవీ కాలాల్లో భారత ప్రధానమంత్రిగా సేవలందించారు.
సంతాపం తెలుపుతున్న ప్రముఖులు
1932 సెప్టెంబర్ 26న పంజాబ్‌లోని (ప్రస్తుతం పాకిస్తాన్‌లో)గాహ్ గ్రామంలో జన్మించిన మన్మోహన్ సింగ్, ఐఎంఎఫ్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వంటి అంతర్జాతీయ స్థాయి బాధ్యతలను నిర్వర్తించారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రిగా పనిచేసి దేశ అభివృద్ధికి తనదైన ముద్ర వేశారు. మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2008లో కుదిరిన అమెరికా-భారత పరమాణు ఒప్పందం అతని రాజనీతికి చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత స్థానాన్ని బలపరిచేందుకు చేపట్టిన చొరవలు ఆయన నాయకత్వాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన సేవలు భారత ఆర్థిక, రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ, ప్రస్తుత రాజకీయ నేతలు, ప్రపంచ నాయకులు ఆయన విశేషాలను కొనియాడారు.
1991 నుండి 1996 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్
డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజకీయ, ఆర్థిక రంగాలలో తన అత్యున్నత సేవల ద్వారా భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు. 1971లో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరడం ద్వారా ఆయన భారత ప్రభుత్వంతో తన అనుబంధాన్ని ప్రారంభించారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్రధాన మంత్రికి సలహాదారు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ వంటి అనేక కీలక పదవులను అలంకరించారు. 1991 నుండి 1996 వరకు ఆయన ఆర్థిక మంత్రిగా చేసిన సేవలు భారత ఆర్థిక చరిత్రలో మలుపు తెచ్చాయి.
మన్మోహన్ సింగ్ పొందిన అవార్డులివే
1)పద్మ విభూషణ్ (1987) 2)జవహర్లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం (1995) 3)ఆసియా మనీ అవార్డు - ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ (1993-1994) 4)యూరో మనీ అవార్డు - ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ (1993) 5)ఆడమ్ స్మిత్ ప్రైజ్ (1956) 6)రైట్ ప్రైజ్ (1955)