Natwar Singh : కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత
కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత నట్వర్ సింగ్(95) కన్నుముశారు. చాలా కాలంగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి కన్నుముశారు. దిల్లీ సమీపంలోని గురుగ్రామ్ లో ఉన్న మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో నట్వర్ సింగ్ కేంద్రమంత్రిగా పనిచేశారు. విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
దిల్లీలో నట్వర్ సింగ్ అంత్యక్రియలు
నట్వర్ సింగ్ అంత్యక్రియలు ఇవాళ దిల్లీలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1929లో రాజస్థాన్‌లోని భరత్ పూర్ జిల్లాలో ఆయన జన్మించారు. 1966-1971 వరకు మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కార్యాలయంలో కూడా పనిచేశారు. 1984లో కేంద్రం నట్వర్‌ను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. నట్వర్ సింగ్ అనేక పుస్తకాలను రచించిన విషయం తెలిసిందే.