Amaravati: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనానికి శంకుస్థాపన.. ఏపీలో సాంకేతిక విప్లవానికి ముందడుగు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ సాంకేతిక భవిష్యత్తుకు మలుపు తిప్పే చారిత్రక ఘట్టం అమరావతిలో ప్రారంభమైంది. ప్రపంచ స్థాయి క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో ఏర్పాటు చేసిన 'అమరావతి క్వాంటమ్ వ్యాలీ' భవన నిర్మాణానికి శనివారం పునాదిరాయి వేశారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి దేశంలో క్వాంటమ్ విప్లవానికి నేతృత్వం వహించే అవకాశాన్ని ఇస్తుందని అంచనా. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.
Details
నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రంగా మారనుంది
భారతదేశంలోనే తొలి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను అమరావతికి తీసుకురావడానికి IBM, TCS, L&T సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సర్స్, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, రక్షణ, ఆరోగ్య, ఆర్థిక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ఇది కేంద్రంగా మారనుంది. ప్రపంచ స్థాయి క్వాంటమ్ హబ్‌లతో సమానంగా అమరావతిని నిలపాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం.
Details
పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు
క్వాంటమ్ వ్యాలీ ద్వారా ప్రపంచ స్థాయి పరిశోధన కేంద్రాలు, గ్లోబల్ టెక్నాలజీ సంస్థల పెట్టుబడులు, స్టార్టప్ ఎకోసిస్టం విస్తరణ, లక్షల యువతకు నైపుణ్య శిక్షణ, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ నాటికి క్వాంటమ్ వ్యాలీ భవనం సిద్ధం చేయడం, డిసెంబర్ కల్లా క్వాంటమ్ కంప్యూటర్‌ను అమర్చడం లక్ష్యంగా పెట్టింది. భవిష్యత్తులో బోస్టన్, సింగపూర్, షాంఘై లాంటి ప్రపంచ స్థాయి క్వాంటమ్ కేంద్రాలతో సమానంగా అమరావతి నిలవనుంది.