HPV vaccination: దేశవ్యాప్తంగా బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా కార్యక్రమం
ఈ వార్తాకథనం ఏంటి
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అరికట్టేందుకు ఉపయోగించే హెచ్‌పీవీ (HPV) టీకాను దేశమంతటా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక టీకా డ్రైవ్‌లో భాగంగా 14 ఏళ్లు దాటిన బాలికలకు ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గార్డాసిల్ (Gardasil) ఇంజెక్షన్‌ను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా ఖర్చు లేకుండా అందించనున్నట్టు సమాచారం. ఈ టీకా గర్భాశయ క్యాన్సర్‌కు దారితీసే నాలుగు రకాల హెచ్‌పీవీ వైరస్‌ల నుంచి రక్షణ ఇస్తుంది. ముఖ్యంగా హెచ్‌పీవీ టైప్ 16,18తో పాటు టైప్ 6,11 రకాల వైరస్‌ల ప్రభావాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని అధికారులు తెలిపారు.
వివరాలు
15ఏళ్లు దాటిన వారికీ మాత్రం మూడు డోసులు
దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనాలు ఒక డోసు టీకా తీసుకున్నప్పటికీ దీర్ఘకాల రక్షణ లభిస్తుందని స్పష్టం చేశాయి. జాతీయ స్థాయి కార్యక్రమంలో భాగంగా ఈ టీకాను స్వచ్ఛందంగా, ఉచితంగా అందించనున్నారు. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమయ్యే గార్డాసిల్-4 టీకాను 15 ఏళ్ల లోపు బాలికలు రెండు డోసులుగా తీసుకోవాలి. ఒక్కో డోసు ధర సుమారు రూ. 3,927గా ఉంది. 15ఏళ్లు దాటిన వారు మాత్రం మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టీకా 2006లో అందుబాటులోకి వచ్చి, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 50 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి. అనేక దేశాల్లో ఈ టీకా ప్రవేశపెట్టిన తరువాత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు గణనీయంగా తగ్గినట్లు అంచనాలు సూచిస్తున్నాయి.
వివరాలు
క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 20 లక్షలకు చేరే అవకాశం
ప్రస్తుతం 160 దేశాల్లో ఈ టీకా కార్యక్రమం అమలులో ఉండగా, అందులో 90 దేశాలు సింగిల్ డోసు విధానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల పరంగా చైనా, అమెరికా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. 2040 నాటికి దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 20 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సుమారు 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడుతుండగా, వారిలో దాదాపు 15 లక్షల మంది భారతీయులేనని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.