LOADING...
MMTS: జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం.. ప్రభుత్వ కీలక నిర్ణయం
జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం.. ప్రభుత్వ కీలక నిర్ణయం

MMTS: జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం.. ప్రభుత్వ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 19, 2026
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలకు పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికతో ముందుకు వచ్చింది. ప్రజారవాణాను ప్రోత్సహించేందుకు ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు సహా అందరికీ ఉచిత ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రవాణా ఖర్చులు తగ్గి ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాయగా, ఇప్పటికే స్పందన కూడా వచ్చింది. ఈ ఉచిత ప్రయాణ పథకానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వివరాలు

సంవత్సరానికి రూ.10 కోట్ల వరకు ఆదాయం

అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితర అధికారులు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో సమావేశమై చర్చలు జరిపారు. జూన్ 2 నుంచి ఏడాది పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పనితీరు ఆధారంగా తర్వాత కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ ప్రయాణికుల సంఖ్య ఆధారంగా రైల్వేకు సంవత్సరానికి సుమారు రూ.10 కోట్ల ఆదాయం వస్తోందని అంచనా. ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల సంఖ్య ఎంత పెరిగినా ప్రస్తుత ఆదాయాన్ని తామే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొవిడ్‌కు ముందు ఎంఎంటీఎస్ రైళ్లకు మంచి ఆదరణ ఉండేది.

వివరాలు

ప్రస్తుతం 80 నుంచి 88 రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి

అప్పట్లో 121 రైళ్ల ద్వారా రోజుకు సుమారు 1.20 లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం 80 నుంచి 88 రైళ్లు మాత్రమే నడుస్తుండగా, రోజువారీ ప్రయాణికుల సంఖ్య 38 వేల నుంచి 42 వేల మధ్య ఉందని సమాచారం. రైళ్ల ఫ్రీక్వెన్సీ తగ్గడం, సమయపాలనలో లోపాలు ఉండటంతో ప్రయాణికుల ఆదరణ తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో ఎంఎంటీఎస్ సేవలను మెరుగుపరచాలని కోరుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, పురపాలక అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు లేఖ రాశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్చి 26న ఎంఎంటీఎస్ సేవలపై సమీక్ష నిర్వహించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఆ లేఖలో ముఖ్యంగా కొన్ని సూచనలు చేశారు.

Advertisement

వివరాలు

సమయపాలనను మెరుగుపరచాలి

రద్దీ సమయాల్లో ఎంఎంటీఎస్ ట్రిప్పుల సంఖ్య పెంచాలని, సమయపాలనను మెరుగుపరచాలని, స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. అలాగే ప్రయాణికులు ఇంటి నుంచి స్టేషన్‌కు, స్టేషన్ నుంచి ఇంటికి చేరేందుకు ఆర్టీసీ షటిల్ బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటికి రైల్వే స్టేషన్లలో స్థలం కేటాయించాలని కూడా కోరారు. ఈ అంశాలపై దక్షిణ మధ్య రైల్వే స్పందిస్తూ, ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించిన ముసాయిదా ఎంఓయూ పంపించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. జయేశ్ రంజన్ లేఖకు సమాధానంగా ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఐటీవై పాండే ఈ వివరాలు తెలియజేశారు.

Advertisement

వివరాలు

రైల్వే బోర్డు అనుమతి తీసుకోవాలి

ముసాయిదా ఎంఓయూను పరిశీలించిన తర్వాత రైల్వే బోర్డు అనుమతి తీసుకుంటామని తెలిపారు. ఎన్ని రైళ్లు నడపాలి, ఏ సమయాల్లో నడపాలి అనే విషయాలు రైల్వే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం స్టేషన్లలో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. అలాగే ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రైల్వే శాఖకు రూ.491.45 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఆ మొత్తాన్ని విడుదల చేయాలని రైల్వే కోరింది.

Advertisement