Uttar Pradesh: తాగుబోతు భర్తల నుంచి విముక్తి.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో ఒక విభిన్న ఘటన చోటు చేసుకుంది.
ఇద్దరు మహిళలు తమ భర్తల తాగుబోతు అలవాట్లకు విసిగిపోయి, గృహహింస నుంచి తప్పించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు తమ మధ్య ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు.
కవిత అనే మహిళ గుంజా అలియాస్ బబ్లూ అనే మరొక మహిళను డియోరియోలో ఉన్న చోటీ కాశీ శివాలయంలో పెళ్లి చేసుకుంది.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ ఇద్దరు పరిచయమయ్యారు. ఇద్దరి జీవితాల్లోనూ భర్తల తాగుబోతు ప్రవర్తన కారణంగా గృహహింసకు గురైన వారు, తమ బాధలు ఓర్చుకోలేక ఆత్మీయ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
Details
గుడిలో ఏడు అడుగులు వేసిన మహిళలు
పెళ్లి సమయంలో గుంజా పెళ్లి కుమారుడిగా మారి, కవిత నుదుటి పై సింధూరం పెట్టింది.
వారిద్దరూ దండలు మార్చుకుని గుడిలో ఏడు అడుగులు నడిచారు. తన భర్త ఎల్లప్పుడూ మద్యం తాగి వేధించేవాడని కవిత తెలిపింది.
గుంజా కూడా ఇదే అనుభవాన్ని పంచుకుంటూ, ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నామని వెల్లడించింది.
తమ కొత్త జీవితాన్ని గోరఖ్‌పూర్‌లో ప్రారంభించి, ఓ ఇల్లు అద్దెకు తీసుకోవాలని వారు తెలిపారు. ఈ పెళ్లి చాలా సాదాసీదాగా జరిగినట్లు ఆలయ పూజారి ఉమా శంకర్ పాండే తెలిపారు.