LOADING...
Shiv Sena UBT: శివసేన (యూబీటీ)లో మళ్లీ చీలిక కలకలం.. ఎంపీల సమావేశానికి ముగ్గురే హాజరు!
శివసేన (యూబీటీ)లో మళ్లీ చీలిక కలకలం.. ఎంపీల సమావేశానికి ముగ్గురే హాజరు!

Shiv Sena UBT: శివసేన (యూబీటీ)లో మళ్లీ చీలిక కలకలం.. ఎంపీల సమావేశానికి ముగ్గురే హాజరు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2026
02:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీ మరోసారి రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గురువారం నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి లోక్‌సభ నుంచి కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో పార్టీ చీలికపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరినట్లైంది. ప్రస్తుతం శివసేన యూబీటీకి లోక్‌సభలో 9మంది ఎంపీలు ఉండగా, రాజ్యసభలో సంజయ్ రౌత్ ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా హాజరు కావాలని విప్ జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీలో గురువారం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. అయితే సమావేశానికి సంజయ్ రౌత్‌తో పాటు లోక్‌సభ ఎంపీలు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాభౌ వాజే హాజరయ్యారు. మిగిలిన ఆరుగురు ఎంపీలు సమావేశానికి గైర్హాజరయ్యారు.

వివరాలు

గైర్హాజరైన ఎంపీలకు షోకాజ్ నోటీసులు

దీంతో గైర్హాజరైన ఎంపీలకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఒకవేళ నిర్దిష్ట గడువులోగా స్పందించకపోతే, విప్‌ను ఉల్లంఘించిన ఎంపీలపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరనున్నట్లు అరవింద్ సావంత్ మీడియాకు తెలిపారు. ఇదిలా ఉండగా, గైర్హాజరైన ఆరుగురు ఎంపీలు త్వరలోనే ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలో చేరనున్నట్లు కొంతకాలంగా ప్రచారం సాగుతోంది.

వివరాలు

ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు

తాము శిందే శివసేనలో విలీనం కావాలని నిర్ణయించుకున్నందున లోక్‌సభలో తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని వారు స్పీకర్ కార్యాలయానికి లేఖ పంపినట్లు వార్తలు వచ్చినప్పటికీ, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ ఆరుగురు ఎంపీలు పార్టీని వీడితే, శివసేనలో మరోసారి చీలిక చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 2022లో ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు కారణంగా శివసేన రెండు వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తాజా పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Advertisement