Board exams: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
టెన్త్, ఇంటర్( 10th, 12th board exams) బోర్డు పరీక్షలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ కీలక చర్యలు తీసుకుంటోంది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అంటే 2025-26నుంచి విద్యార్థులకు సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో PM SHRI(ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని ప్రారంభించిన తర్వాత.. ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం అనేది కొత్త జాతీయ విద్యా విధానం(NEP-2020) లక్ష్యాలలో ఒకటి. కొత్త జాతీయ విద్యా విధానానికి అనుగూనంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు రెండుసార్లు బోర్డు పరీక్షలు రాయడం వల్ల.. రెండింటిలో వారి ఉత్తమ స్కోరును ఎంచుకునే అవకాశం ఉంటుంది.
బోర్డు పరీక్షలపై గతేడాదే కేంద్రం ప్రకటన
కొత్త కరికులం ఫ్రేమ్‌వర్క్(ఎన్‌సీఎఫ్) ప్రకారం విద్యార్థులకు తగిన సమయం, మంచి పనితీరును కనబరచడానికి కనీసం రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహిస్తామని గత ఏడాది ఆగస్టులో విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విద్యార్థులను ఒత్తిడి లేకుండా ఉంచడం, నాణ్యమైన విద్యతో వారిని సుసంపన్నం చేయడం, భవిష్యత్తు కోసం వారిని సిద్ధం చేసే ప్రధాన ఉద్దేశంతో కేంద్రం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు ధర్మేంద్ర పేర్కొన్నారు. 2047నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాన్ని సృష్టించడం కోసం విద్యావిధానంలోకి సంస్కరణలు దోహదపడుతాని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2036 ఒలింపిక్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇస్తుందని, నాలుగేళ్లలో జరగనున్న ఈ ఈవెంట్‌లో దేశానికి 10 శాతం పతకాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అథ్లెట్ల నుంచే రావాలని ఆశిస్తున్నానని చెప్పారు.