West Bengal: పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా కలితా మాఝీ
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఒక మహిళ సాధించిన విజయం ఆసక్తికరంగా మారింది. కలితా మాఝీ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఔస్‌గ్రామ్ నియోజకవర్గంలో గెలుపొందారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై 12,535 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గతంలో పలు ఇళ్లలో పనిమనిషిగా పనిచేసిన ఆమె నెలకు కేవలం రూ.2,500 మాత్రమే సంపాదించేవారు. ఆస్తులు, అంతస్తులు లేకపోయినప్పటికీ.. తన మంచితనంతో ఆమె ఇంతటి భారీ విజయాన్ని సాధించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గుస్కారా మున్సిపాలిటీ పరిధికి చెందిన మాఝీ రాజకీయాల్లోకి రావడానికి ముందు పలు ఇళ్లలో సహాయకురాలిగా జీవనం సాగించారు.
వివరాలు
మాఝీ విజయం బెంగాల్ రాజకీయాల్లో కొత్త మార్పుకు సంకేతం
2021 ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ఆమెకు అవకాశం ఇవ్వడంతో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన అభేదానంద థాండర్ చేతిలో ఓటమి చవిచూశారు. అయితే స్థానిక ప్రజలతో ఉన్న బలమైన అనుబంధంపై నమ్మకం ఉంచిన పార్టీ మరోసారి తాజా ఎన్నికల్లో ఆమెకు అవకాశం కల్పించింది. ఈసారి ఆమె ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుని విజయం సాధించారు. సాధారణ జీవితం గడిపే వ్యక్తులు కూడా పట్టుదలతో ఎన్నికల్లో గెలవగలరని ఆమె నిరూపించారు. మాఝీ విజయం బెంగాల్ రాజకీయాల్లో కొత్త మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు.