తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ తమిళసై ప్రసంగం ఎలా ఉండబోతోంది?
రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య ఉప్పు- నిప్పు చందంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.10గంటలకు 'బడ్జెట్ 2023-24' సమావేశాలు మొదలు కానుండగా, అందరి దృష్టి తెలంగాణ అసెంబ్లీపైనే ఉంది. ఇటీవల తమిళనాడు, కేరళ అసెంబ్లీల్లో గవర్నర్లు చేసిన వివాదాస్పద ప్రసంగాల నేపథ్యంలో తెలంగాణలో ఎలా ఉంటుందనేది ఆసక్తిని రేపుతోంది. ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని గవర్నర్ సౌందరరాజన్ యథావిధిగా చదువుతారా? లేదా? అనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ, సెక్రటేరియట్ అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలుత గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్విహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. హైకోర్టు ఆదేశాలతో గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
రెండేళ్ల తర్వాత గవర్న్ ప్రసంగం
2022-23 బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండా జరిగాయి. గత సమావేశాలకు కొనసాగింపుగా ఆ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పడు తెలిపింది. ఈ క్రమంలో దాదాపు రెండేళ్ల తర్వాత అసెంబ్లీ గవర్నర్ ప్రసంగించబోతున్నారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ అసెంబ్లీ సెక్రటేరియట్ లేఖలు పంపింది. అసెంబ్లీ స్పీకర్ పి. శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. 2018 నుంచి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడంతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు అధికార బీఆర్‌ఎస్ మాత్రం తామ చేసిన అభివృద్ధి గణాంకాలతో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పేందుకు సమాయత్తమవుతోంది.