Page Loader
రాజ్‌భవన్‌లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం
రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ జరుపుకోవాలని గవర్నర్‌‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ

రాజ్‌భవన్‌లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం

వ్రాసిన వారు Stalin
Jan 25, 2023
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రాష్ట్రంలో రిపబ్లిక్ డే వేడుకలను అధికారంగా నిర్వహించడం లేదని, రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ జరుపుకోవాలని తెలంగాణ గవర్నర్‌ తమిళసైకి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ప్రతి ఏటా పరేడ్ గ్రౌండ్‌లో రిపబ్లిక్ డే వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ వేడుకలకు గవర్నర్ హాజరై ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని చదువుతారు. గురువారం రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ప్రసంగం కాపీని పంపాలని ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై లేఖ రాశారు. స్పందించిన ప్రభుత్వం ఈ ఏడాది వేడుకలను రాజ్ భవన్‌లోనే జరుపుకోలని సమాధానం రాసింది.

గవర్నర్

కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్ తమిళసై

2022లో కరోనా కారణంగా తెలంగాణ ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్‌లో రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేసింది. దీంతో గవర్నర్ తమిళసై రాజ్‌భవన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా ఆమె ఉండటంతో హైదరబాద్ నుంచి నేరుగా అక్కడి వెళ్లి అక్కడి అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా వేడుకలు అధికారికంగా నిర్వహించకపోవడంతో హైదరాబాద్ రాజ్ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరి వెళ్లనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించకపోవడంపై గవర్నర్ తమిళసై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కరోనా పేరుతో వేడుకలను నిర్వహించకపోవడం సరికాదన్నారు.