LOADING...
Agritourism: పచ్చని పొలాల మధ్య పల్లె అనుభవం: అగ్రిటూరిజం ప్రత్యేకత
పచ్చని పొలాల మధ్య పల్లె అనుభవం: అగ్రిటూరిజం ప్రత్యేకత

Agritourism: పచ్చని పొలాల మధ్య పల్లె అనుభవం: అగ్రిటూరిజం ప్రత్యేకత

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 03, 2025
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

పచ్చని పొలాల మధ్య స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ కాలువగట్టుల మీద నడవాలనిపిస్తుందా? మట్టి దారులపై ఎద్దుల బండిపై ప్రయాణించి పల్లెటూరి అందాలను చూడాలనుకుంటున్నారా? లేక మంచె మీద కూర్చుని సేదతీరుతూ పల్లె వాతావరణంలో మునిగిపోవాలనుకుంటున్నారా? ఇలాంటి అనుభవాలన్నింటినీ వ్యవసాయ పర్యాటకం (అగ్రిటూరిజం) అందిస్తోంది. పల్లె జీవితపు సహజ అందాలను అనుభవించడంతో పాటు, భారత వ్యవసాయ ప్రాధాన్యం, వైవిధ్యం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచనకు రూపకల్పన చేసింది. 2005లో అగ్రిటూరిజం ఇండియా సంస్థను ఏర్పాటు చేసింది. అదేవిధంగా స్వదేశీదర్శన్, అప్నాదేశ్, వైబ్రెంట్ విలేజెస్ ప్రాజెక్టుల్లో కూడా అగ్రిటూరిజాన్ని చేర్చారు.

వివరాలు 

పర్యాటకులు ఏమి చేస్తారు? 

మొదటగా మహారాష్ట్రలోని పల్షివాడి గ్రామంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,700 గ్రామాలకు విస్తరించింది. ఇప్పటివరకు దేశీ,విదేశీ పర్యాటకులలో దాదాపు 1.20కోట్ల మంది మన పల్లెబాట పట్టారు. ఈ కార్యక్రమం పర్యాటకశాఖ, వ్యవసాయశాఖలతో పాటు రైతులు,రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, టూర్ ఆపరేటర్ల సహకారంతో విజయవంతంగా సాగుతోంది. గ్రామాలకు వెళ్లి రైతుల ఇళ్లలోనే బస చేస్తారు. కోడి కూతలతో,ఆవుల అంబరావాలతో అరుపులతో పొద్దున్నే నిద్రలేస్తారు. పల్లె సంప్రదాయ దుస్తులు ధరించి,గ్రామీణ ఆహారం రుచి చూస్తారు. రైతులతో కలిసి ఎద్దుల బండ్లలో, ట్రాక్టర్లలో విహరిస్తారు. పొలాల్లో దున్నడం, కలుపు తీయడం, పంట కోయడం వంటి పనుల్లో పాలుపంచుకుంటారు. పండ్లతోటలు, ఉద్యానవనాలు సందర్శించి, పండ్లు కోసుకొని తింటారు. వ్యవసాయ ఉత్పత్తులు, గ్రామీణ చేతివృత్తులపై అవగాహన పొందుతారు.

వివరాలు 

మన దగ్గర..? 

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమలో కొబ్బరి, అరటి తోటలు, మదనపల్లెలో టమాటా తోటలు, అరకులో అటవీ వ్యవసాయం, అనంతపురంలో వేరుశనగ తోటలు, చిత్తూరులో జీడిపప్పు, కడియంలో పూల తోటలు ఆకర్షణీయంగా ఉంటాయి. తీరప్రాంతంలో మత్స్యకార గ్రామాల్లో చేపలు, రొయ్యల సాగును కూడా చూడవచ్చు. తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో ద్రాక్షతోటలు, కందులు, మానుకోటలో మిర్చి, ఆదిలాబాద్‌లో పత్తి, సోయా, నల్గొండలో బత్తాయి, సిద్దిపేటలో కూరగాయలు, నిజామాబాద్‌లో గోదావరి తీరం గ్రామాలు, ఆర్మూర్‌లో పసుపు, జగిత్యాలలో మామిడి, వరంగల్‌లో మిర్చి తోటలు, ఖమ్మంలో పామాయిల్ తోటలు చూడదగినవి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా పర్యాటకశాఖ కార్యక్రమాలు లేవు. పర్యాటకులు తమ సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు 

2025కి ఎంపికైన ఉత్తమ వ్యవసాయ పర్యాటక గ్రామాలు 

కేరళలోని కుమరకోం, మహారాష్ట్రలోని కర్డే, పంజాబ్‌లోని సేంద్రియ వ్యవసాయ కేంద్రం హన్సాలి, ఉత్తరాఖండ్‌లో ప్రకృతి సేద్యం జరిగే సుపి, పశ్చిమ బెంగాల్‌లో పత్తి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన బారానగర్, ఈ గ్రామాలు 2025 సంవత్సరానికి గాను ఉత్తమ వ్యవసాయ పర్యాటక గ్రామాలుగా ఎంపికయ్యాయి.