జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రెండు రోజుల పాటు జీ20 సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 16, 17 తేదీల్లో జరగనున్న ఈ సమావేశాల్లో 'థింక్-20' అనే థీమ్‌పై చర్చించనున్నారు. ఇందుకోసం రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. భోపాల్‌లోని కుషాభౌ థాక్రే కన్వెన్షన్ సెంటర్‌లో ఈ సమావేశాలు జరుగుతాయి. మేధావులు, ఆర్థికవేత్తలు, అధికారులతో పాటు విదేశీ దేశాల నుంచి కనీసం 94 మంది ప్రతినిధులు సమావేశాల్లో పాల్గొనేందుకు భోపాల్ చేరకున్నారు. మొదటి రోజు మరో 10సమాంతర సమావేశాలను నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవస్థల పరివర్తన, ఆరోగ్య సంరక్షణ, సాంప్రదాయ వైద్యం వంటి వివిధ అంశాలపై సమాంతర సెషన్లలో చర్చించనున్నారు.
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తొలి ప్రసంగం
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభ సెషన్‌ను ప్రారంభించి.. 'గ్లోబల్ గవర్నెన్స్ విత్ లైఫ్, వాల్యూస్, వెల్‌బీయింగ్'తో సహా పలు అంశాలపై ఆయన మాట్లాడుతారని ప్రభుత్వం సోమవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రారంభ సెషన్‌లో ఇండోనేషియా రాజకీయ వ్యవహారాలు, చట్టం, రక్షణ, భద్రత డిప్యూటీ మంత్రి స్లామెట్ సోడర్సోనో, భారత జీ20 ప్రెసిడెన్సీ చీఫ్ కోఆర్డినేటర్ హర్ష్ వర్ధన్ ష్రింగ్లా, నీతి ఆయోగ్ వైస్ చైర్‌పర్సన్ సుమన్ బెరీ ప్రసంగిచనున్నారు. 'థింక్-20' అనేది జీ20లో చర్చించే విషయాల్లో కీలమైన అంశమని చీఫ్ కో-ఆర్డినేటర్ హర్షవర్ధన్ ష్రింగ్లా చెప్పారు. భారత అధ్యక్షతన జరిగే ఈ సమావేశాలకు అందరిని కలుపుకుపోయి.. ఫలితాలను సాధించేందుకు చర్యలు తీసుకుంటామని ష్రింగ్లా పేర్కొన్నారు.