తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణ
గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని కృష్ణమోహన్ రెడ్డిపై న్యాయస్థానం వేటు వేసింది. దీంతో రెండో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి డీకే అరుణను హైకోర్టు ఎమ్మెల్యే గా ప్రకటించింది. కృష్ణమోహన్ రెడ్డి తన ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదని, ఓట్ల ఎన్నికల సమయంలో వీవీ ప్యాట్స్‌కు సంబంధించిన చీటీలను సరిగా లెక్కించలేదంటూ హైకోర్టులో డీకే అరుణ రెండు పీటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అనర్హత పిటిషన్లపై వరుసగా విచారణ జరుపుతున్న హైకోర్టు
కృష్ణమోహన్ రెడ్డికి రూ. 3లక్షలు జరిమానా విధించిన హై కోర్టు, ఇందులో రూ. 50వేలు డీకే అరుణకు ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఇటీవల వరుసగా అనర్హత పిటిషన్లపై విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విషయంలోనూ ఇలానే జరిగింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చిన హైకోర్టు, సమీప ప్రత్యర్థి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఈ తీర్పుపై వనమా సుప్రీం నుంచి స్టే తెచ్చుకున్న విషయం తెలిసిందే.