థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ ముఠా గుట్టు రట్టు; చికోటి ప్రవీణ్ అరెస్టు
భారతదేశంలో ఫెమా ఉల్లంఘనల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌ను థాయ్ లాండ్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో అతనిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. థాయ్‌లాండ్ పోలీసులు గత వారం రోజులుగా ఒక హోటల్‌లో గ్యాంబ్లింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారం ఆధారంగా ఆసియా పట్టాయా హోటల్‌పై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 80 మందికి పైగా భారతీయులతో సహా, 14 మంది మహిళలను అరెస్టు చేశారు.
రూ.20 కోట్ల గ్యాంబ్లింగ్ చిప్స్ స్వాధీనం
చికోటి ప్రవీణ్ అతని మిత్రులతో కలిసి గ్యాంబ్లింగ్ నిర్వహంచేందుకు థాయ్‌లాండ్‌కు చాలామందిని దేశం నుంచి తీసుకెళ్లినట్లు సమాచారం. థాయ్‌లాండ్ పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రవీణ్ సన్నిహితుడు మాధవరెడ్డి, మెదక్ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డితో హైదరాబాద్‌కు చెందిన మరికొందరు ప్రముఖులను అరెస్టు చేశారు. జూదగాళ్ల వద్ద మొత్తం రూ.20 కోట్ల గ్యాంబ్లింగ్ చిప్స్, ఇండియన్ కరెన్సీని పట్టుకున్నట్లు సమాచారం. బౌద్ధ దేశం అయిన థాయ్‌లాండ్‌లో జూదం అడటం నేరం. థాయిలాండ్‌లో గ్యాంబ్లింగ్ నేరాలు చాలా కఠినంగా ఉంటాయి.