
Gandikota: గండికోటకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. మోస్ట్ ప్రామిసింగ్ డెస్టినేషన్ అవార్డు ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోటకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. దిల్లీలో జరిగిన BLTM (బిజినెస్ లీజర్ ట్రావెల్ అండ్ ఎగ్జిబిషన్) 2025లో గండికోట 'మోస్ట్ ప్రామిసింగ్ న్యూ డెస్టినేషన్' అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ చీఫ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్ ఆఫీసర్ పద్మారాణి స్వీకరించారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు యశోభూమి, ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఐఐసీసీ)లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ వారసత్వ ప్రదేశాలు, సహజ బీచ్ గమ్యస్థానాలు, గ్రామీణ పర్యాటక అనుభవాలు, పర్యావరణ-పర్యాటక చొరవలను ప్రదర్శించింది.
Details
బాధ్యతాయుతమైన పర్యాటక అవార్డుతో గుర్తింపు
గండికోటకు ఐసీఆర్టీ (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ టూరిజం) మరియు భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ మద్దతుతో, బాధ్యతాయుతమైన పర్యాటక అవార్డుల విభాగంలో గుర్తింపు లభించింది. ఈ జాతీయ స్థాయి గుర్తింపు గండికోటను సాహసోపేత పర్యాటకులకు ప్రధాన గమ్యస్థానంగా మలుస్తుందని ఆశిస్తున్నారు. బీఎల్‌టీఎం 2025 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రతినిధులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీలంక, ఇజ్రాయెల్, రష్యా, ఐరోపా వంటి దేశాల నుంచి వచ్చిన కార్పొరేట్ సంస్థలు, ప్లానర్లు, టూర్ ఆపరేటర్లు, గమ్యస్థాన నిర్వహణ కంపెనీలు, హాస్పిటాలిటీ బ్రాండ్‌లకు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల విశేషాలను వివరించారు.
Details
పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం, గండికోట, సూర్యలంక బీచ్‌లను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించడం, సమావేశాలు, కార్పొరేట్ ఈవెంట్లు, ప్రోత్సాహక ప్యాకేజీల ద్వారా పర్యాటక విభాగాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం ప్రభుత్వ ప్రాధాన్యం. ఈ బీఎల్‌టీఎం ఈవెంట్‌లో 500 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 15,000 మంది ప్రీ-క్వాలిఫైడ్ బయ్యర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక సామర్థ్యాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రదర్శించారు.